గిరిజన బిడ్డలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి
- తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి
ములుగు ప్రతినిధి : గిరిజన యూనివర్సిటీ పేరుతో కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాయని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగులో జరిగిన నియోజకవర్గ స్థాయి సోషల్ మీడియా మీటింగ్ లో ఆయన మాట్లాడారు. గిరిజన యూనివర్సిటీ పేరుతో చలో మేడారం అంటూ ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ డ్రామాలాడుతోంద మండిపడ్డారు. నాలుగైదేళ్లక్రితం రావాల్సిన గిరిజన యూనివర్సిటీ.. బీజేపీ వల్లే ఆలస్యం అయిందన్నారు. గిరిజన యూనివర్సిటీ ఇన్నేళ్లు ఎందుకు ఆలస్యం చేశారో చెప్పాలన్నారు. ఎన్నికల ముందు గిరిజన యూనివర్సిటీ ప్రకటిస్తున్నామని చెప్పి ఆ యూనివర్సిటీకి సమ్మక్క సారలమ్మ వనదేవతల పేర్లు పెట్టి ప్రజల మనోభావాలతో రాజకీయం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. మన దేవతల పేరు పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని.. కానీ ఆ పేరుతో రాజకీయం చేయాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఉపేక్షించేది లేదన్నారు. గిరిజన యూనివర్సిటీ బీజేపీ బిక్ష కాదని ఈ ప్రాంత ప్రజల హక్కు అన్నారు. కిషన్ రెడ్డి మేడారం వెళ్లి గొప్పలు చెప్పుకోవడం కాదు.. గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఆలస్యం ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. నాలుగైదేళ్ల క్రితనే వర్సిటీ ఇచ్చి ఉంటే ఈ ప్రాంతం కూడా చాలా అభివృద్ధి చెంది ఉండేదన్నారు. వర్సిటీని ఆలస్యం చేసి ఈ ప్రాంత బిడ్డల ఉపాధి అవకాశాలను బీజేపీ దెబ్బతీసిందన్నారు. ములుగు తీరని నష్టం చేసిన బీజేపీ ఇప్పుడు కేవలం ఎన్నికల్లో యూనివర్సిటీ పేరు చెప్పి నాలుగు ఓట్లు దండుకోవాలని కుటిల రాజకీయానికి తెరలేపిందన్నారు. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేడారం వచ్చారన్నారు. ములుగు ప్రాంత అభివృద్ధిని దెబ్బతీసినందుకు మొదటగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, కిషన్ రెడ్డి ములుగు ప్రజలకు, ఇక్కడి గిరిజన బిడ్డలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలని తిప్పి కొట్టాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ కు పిలుపునిచ్చారు. అలాగే సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని సమర్ధవంతంగా ఎలా తిప్పికొట్టాలనే దానిపై వారికి అవగాహన కల్పించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ ఫేక్ న్యూస్ లు ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం చేయాల్సిన అవసరం లేదని.. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారికి సూచించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యక్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జడ్పీ చైర్ పర్సన్, బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ అభ్యర్థి బడే నాగజ్యోతి, ములుగు జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్నాయక్, వరంగల్ ODCMS సూడి శ్రీనివాస్ రెడ్డి, ములుగు జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లె బుచ్చయ్య, తాడ్వాయి ఎంపీపీ వాణిశ్రీ, ములుగు జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు శీలం మధు, ఏటూరునాగారం ఆత్మ కమిటీ చైర్మన్ దుర్గం రమణయ్య, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు కోగీల మహేష్, కొత్తగూడ మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన వేణు, గంగారం మండల అధ్యక్షుడు ఈర్ప సూరయ్య, బీసీ సెల్ అధ్యక్షుడు సురేందర్, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.