టోల్ గేట్ రుసుము వసూలు నిలిపివేయాలి
– జిల్లా కలెక్టర్ కు బిఆర్ఎస్ నేతల వినతి
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి:జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండల సరిహద్దు ప్రాంతమైన మేడిపల్లి వద్ద జాతీయ హైవే అథారిటీ ఏర్పాటు చేసిన టోల్ గేట్ వద్ద రుసుము వసూలను నిలిపివేయాలని భారత రాష్ట్ర సమితి కాటారం సబ్ డివిజన్ నాయకులు జోడు శ్రీనివాస్, రామిల్ల కిరణ్, జక్కు శ్రావన్ లు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అంద జేశారు. శనివారం నాడు గుట్టు చప్పుడు కాకుండా దొంగ చాటున నేషనల్ హైవే అథారిటీ అధికారులు, కాంట్రాక్టర్లు టోల్ గేట్ ను ఎవరికి తెలియకుండానే ప్రారంభించారని వారు దుయ్యబట్టారు. ఈ విషయమై అధికారులను, సంబంధిత కాంట్రాక్టు సిబ్బందిని ప్రశ్నించగా వారి నుండి సరైన సమాధానం రాలేదన్నారు. భూపాలపల్లి జిల్లా కాటారం, మహాదేవపూర్ మండలాల నుంచి నిత్యం వందలాది ఇసుక లారీలు హైదరాబాద్ కు తరలి వెళ్తున్న నేపథ్యంలో రోడ్డు గుంతలు గుంతలుగా ఏర్పడి గాడీలు పడ్డాయని వారు వెల్లడించారు. దాంతో అనేక సందర్భాల్లో ప్రమాదాలు జరిగి ఎందరో మృత్యువాత పడ్డ సంఘటనలు ఉన్నాయనీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టోల్ గేట్ రుసుము వసూలు చేయడం సమంజసం కాదని వారు అన్నారు. జాతీయ హైవే అథారిటీ అధికారులు, కాంట్రాక్టర్లు తక్షణమే రోడ్డును బాగు చేయించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రోడ్డును బాగు చేసిన తర్వాతనే టోల్గేట్ రుసుము వసూలు చేయాలని కలెక్టర్ కు అందజేసిన వినతి పత్రంలో వారు కోరారు. ఇదిలా ఉండగా టోల్ గేట్ ప్రారంభించిన విషయం తెలుసుకున్న సమీప గ్రామ ప్రజలు, భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున టోల్ గేట్ వద్ద నిరసన తెలియజేశారు. ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు సరైన న్యాయం చేకూర్చ లేదని వారు ఆందోళన చేశారు. వరంగల్ ఏరియా డీఈ కుమారస్వామిని టోల్ గేట్ ప్రారంభం సమాచారం విషయమై స్థానిక విలేకరులు అడగగా తమకు ఏమి సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.