Mulugu collector | ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రజలు రూ. 50 వేల కంటే ఎక్కువ తీసుకెళ్లేందుకు అనుమతి లేదు
– జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిణి ఇలా త్రిపాఠి.
ములుగు ప్రతినిధి : ప్రజలు ఎన్నికల కోడ్ ముగిసే వరకు రూ. 50 వేల కంటే ఎక్కువ తీసుకెళ్లేందుకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిణి ఇలా త్రిపాఠి నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల్లో జరిగే అక్రమాలు, ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సీ-విజిల్ యాప్ పౌరుల చేతిలో బ్రహ్మస్త్రంగా మారిందని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఈ యాప్‌ను ఆధునీకరించడంతోపాటు ఫ్లయింగ్ స్కాడ్స్‌తో అనుసంధానం చేశారని అన్నారు. అక్రమాలకు సంబంధించిన ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్ చేస్తే 100 నిమిషాల వ్యవధిలోనే దర్యాప్తు చేసి ఫిర్యాదుదారుడికి తెలియచేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమాచారం జిల్లా ఎన్నికల అధికారితోపాటు నియోజకవర్గ పరిధిలోని ఫ్లయింగ్ స్కాడ్‌కు సత్వరమే చేరుతుందని తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల్లో పార్టీల అభ్యర్థులు, నాయకుల అక్రమాలు, కోడ్ ఉల్లంఘనలపై సామాన్య పౌరులు సైతం నేరుగా ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సీ-విజిల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని, ప్రస్తుతం ఈ యాప్‌ను ఆధునీకరించి ఫ్లయింగ్ స్వాడ్‌తో అనుసంధానం చేయడం జరిగిందని ఎవరైనా కోడ్ ఉల్లంఘించినా, రాజకీయ పార్టీల అభ్యర్థులు, నాయకులు ఓటర్లకు డబ్బులు, మద్యం, బహుమతులు పంచినా ఆ వివరాలతో నేరుగా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. అలాగే ఎన్నికల ప్రచార సమయంలో అనుమతులు లేకుండా లౌడ్ స్పీకర్లు వాడినా, ర్యాలీలు తీసినా, నిబంధనలు ఉల్లంఘించినా, కుల, మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఫిర్యాదు చేసే వెసులుబాటు ఈ యాప్ ద్వారా కల్పించారని తెలిపారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఇప్పటివరకు 07 ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ యాప్‌ను గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్లే స్టోర్‌కు వెళ్లి సీ-విజిల్ యాప్ అని టైప్ చేయగా.. 8.41 ఎంబీ ఉన్న యాప్ డౌన్‌లోడ్ అవుతుందని అన్నారు. యాప్‌ను ఓపెన్ చేసి భాషను ఎంచుకోవడం తదుపరి అక్కడ సూచించే వివిధ నిబంధనలను అంగీకరిస్తున్నట్లుగా టిక్ చేయాలని అనంతరం సీ-విజిల్ ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా అనే యాప్ సెల్‌ఫోన్ స్క్రీన్‌పై కనబడుతుందని వివరించారు. అనంతరం సెల్‌ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఎస్‌ఎంఎస్ ద్వారా నాలుగు నంబర్ల ఓటీపీ వస్తుందని తెలిపారు. దాన్ని ఎంటర్ చేసిన తరువాత వినియోగదారుడికి సంబంధించిన పూర్తి వివరాలు వినియోగదారుడి అడ్రస్, పిన్‌కోడ్, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం వంటి పూర్తి వివరాలు పొందుపరుచాలని అన్నారు. అనంతరం యాప్ ఓపెన్ అయి ఫొటో, వీడియో, ఆడియో లోగోలు కనిపిస్తాయని, వినియోగదారుడు తన ప్రాంతంలో జరిగిన కోడ్ ఉల్లంఘనలపై ఫొటో లేదా వీడియో, ఆడియో రూపంలో లోగోను బట్టి ఎంచుకుని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని అన్నారు. ఆ ఫిర్యాదు నేరుగా ఎన్నికల సంఘానికి చేరుతుందని వారు పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులకు ఫిర్యాదు అందుతుందని తెలిపారు. ఈ యాప్‌లో ఎన్నికల సమయంలో చుట్టుపక్కల జరుగుతున్న కోడ్ ఉల్లంఘనలు పొందుపరుచవచ్చునని , ఈ యాప్ ద్వారా ఫిర్యాదు అందిన 10 నిమిషాల వ్యవధిలోనే ఎన్నికల విధులు నిర్వహించే ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని 100 నిమిషాల వ్యవధిలో చర్యలు తీసుకుంటారని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై ఫిర్యాదులను ప్రజలు 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా, జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదుల స్వీకరించేందుకు 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 68 ఫిర్యాదులు నమోదు కావడం జరిగినదని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంగిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, వీటిని పరిగణలోకి తీసుకొని సజావుగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. అక్రమ నగదు, లిక్కర్ సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో 09 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, 24 గంటలపాటు గట్టి నిఘా ఉంచామని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటు న్నామని పేర్కొన్నారు. ఎక్కువ మొత్తంలో నగదు దొరికితే అట్టి మొత్తం సీజ్ చేసి, జిల్లా ట్రెజరీ అధికారుల వద్ద జమచేస్తారని, ఇప్పటి వరకు 5 లక్షల 68 వేల రూపాయలను సిజ్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. సీజ్ అయిన నగదు విషయమై అప్పీలు, ఆధారాలు పొంది దరఖాస్తు చేసుకోవడానికి జిల్లా గ్రీవెన్స్ కమిటీ (డి ఆర్ డి ఓ, డి సి ఓ, డి టి ఓ) కి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంకా ఇతర సమాచారం కొరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి నోడల్ అధికారి అదనపు కలెక్టర్ రెవిన్యూ డి. వేణు గోపాల్ కాంటాక్ట్ నెం. 7331122632 సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు మద్యం పంపిణీ చేసే ఓటర్లను ప్రలోభకు పెట్టే అవకాశం ఉందని, దీనిని నివారించేందుకు అక్రమ డబ్బు మద్యం తరలింపు పై గట్టి నిఘా ఉంచామని, మన జిల్లా బార్డర్ నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ, నగదు మద్యం తరలింపుపై గట్టి నిఘా ఉంచామని కలెక్టర్ తెలిపారు.జిల్లా లోని బెల్టు షాపులను ముసివేశామని, జిల్లాలో ప్రభుత్వ అనుమతి తీసుకున్న మద్యం షాపుల ద్వారా మాత్రమే మద్యం విక్రయం జరగాలని, మద్యం విక్రయానికి సంబంధించి లెక్కలు పకడ్బందీగా నమోదు కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ అభ్యర్థులు, రాజకీయ పార్టీలు వినియోగించే వీడియో ఆడియోల ప్రదర్శనకు ముందస్తుగా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతి తీసుకోవాలని, ఎవరిపై వ్యక్తిగత దూషణలు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ వీడియోలు చేయడానికి వీలులేదని, కుల మత ప్రాంత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వీడియో ఆడియోలు చేయడానికి వీలు లేదని, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనల ప్రకారం ప్రచారం నిర్వహించుకునే ఆడియో వీడియోలకు అనుమతి జారీ చేస్తామని, ఎంసిఎంసి అనుమతి లేకుండా ప్రచారంలో ఆడియో వీడియోలు వినియోగిస్తే వెంటనే సంబంధిత అభ్యర్థి పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎం సి ఎం సి నోడల్ అధికారి అదనపు కలెక్టర్ లోకల్ బాడీ డి ఎస్ వెంకన్న సెల్ 7331122631 సంప్రదించాలని ఆమె అన్నారు.