మా భూమిని దౌర్జన్యంగా లాక్కుంటున్నారు
– వరిపంటపై గడ్డిమందు కొట్టి చదును చేశారు
– పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినం
– సమస్య పరిష్కరించాలని కలెక్టర్ కు ఫిర్యాదు
ములుగు ప్రతినిధి : 1995వ సంవత్సరం నుంచి తన తల్లి పేరున ఉన్న భూమిని రెండేళ్లుగా ఓ వ్యక్తి దౌర్జన్యం చేస్తూ మా భూమి అంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, వారం రోజుల క్రితం వరి పంటపై గడ్డిమందు చల్లి జేసీబీతో ధ్వంసం చేశాడని ములుగు పంచాయతీ పరిధి పాల్సాబ్ పల్లి గ్రామా నికి చెందిన పత్తి కోటేశ్వర్ రావు కలెక్టరేట్ లో ఫిర్యాదు చేశారు. పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయినా కూడా భూమిపైకి వస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపిం చారు. సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో అదనపు కలెక్టర్ సంపత్ రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోటేశ్వర్ రావు సమస్యను వివరిస్తూ ములుగు జిల్లా వెంకటా పూర్ మండలం లింగాపూర్ శివారులోని 1873/ఆ సర్వే నెంబరులో 4ఎకరాల భూమి ఉంది. తన తల్లి పత్తి వెంక టమ్మ పేరున ప్రభుత్వం 1995లో పట్టా ఇచ్చింది. అప్పటి నుంచి సాగులో ఉన్నాము. అయితే గత రెండేళ్ల నుంచి గోవిందరావుపేట మండలం చల్వాయికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు 1872/3లో 5ఎకరాల ఇతరుల భూమిని తన కూతురిపేరున అక్రమంగా పట్టా చేయించారని కోటేశ్వర్ రావు ఆరోపించారు. అయితే సర్వే నెంబరు మరో చోట ఉన్నా కూడా తన భూమిపైకి వచ్చి వేసిన వరిపంటపై గడ్డిమందు పిచికారీ చేయించి జేసీబీతో ధ్వంసం చేశారన్నారు. తన పంటను చూసేందుకు వెళ్తే ఈ విషయం తెలిసిందని, ఎందు కు ఇలా చేశారని అడిగితే తనపై దౌర్జన్యం చేయడంతో వెంక టాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అయినప్పటికీ బెదిరింపులకు పాల్పడుతూ తన భూమిలోకి వస్తే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. తన భూమిపై అధికారులతో విచారణ చేయించి దాడికి పాల్పడ్డ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఈవిషయంపై వెంకటాపూర్ రెవెన్యూ అధికారులను ఫోన్ లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.