సెక్రటరీ లేరు.. స్పెషల్ ఆఫీసర్ రారు..!
– పంచాయతీ కార్యాలయానికి తాళం
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం: స్పెషల్ ఆఫీసర్ రారు.. సెక్రటరీ లేక గ్రామపంచాయతీ తెరవడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నాయిగూడెం మండల కేంద్రం లోని లక్ష్మీపురం గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పంచాయితీకి తాళం వేసిన దృశ్యాన్ని ‘‘తెలంగాణజ్యోతి” రిపోర్టర్ కెమెరాలో బంధించారు. పర్యవేక్షణ లోపంతో సిబ్బంది కూడా సక్రమంగా పనిచేయడం లేదన్న ఆరోపణ బలంగా వినిపిస్తోంది. గ్రామం లో పారిశుధ్యం,వీధిలైట్లు సక్రమంగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే వీధుల్లో చెత్తాచెదారం పేరుకుపోయి మురికి కాలువలను సకాలంలో శుభ్రం చేయడం లేదు. దీంతో దోమలు పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. వీధి దీపాలు సరిగా వెలగక పోవడంతో ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక ప్రజలు భయంతో నడవాల్సి వస్తోంది. కార్యదర్శి ప్రత్యేక అధికారి లేక కార్యాలయం తెరవక పోవడంతో జనన మరియు మరణ ధృవీకరణ పత్రాలు కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామ పంచాయతీకి వివిధ పనుల నిమిత్తం వచ్చినా గ్రామ పంచాయతీ కార్యాలయం తాళం తీయక పోవడంతో ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.