భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకం
– జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర ముఖ్యమైనదని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. మంగళవారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన లైసెన్స్డ్ సర్వేయర్ల ధ్రువపత్రాల పరిశీలన, సామగ్రి పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 26 నుండి జూలై 26 వరకు లైసెన్స్డ్ సర్వేయర్లకు ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకో వాలని కలెక్టర్ కోరారు. వివిధ సందర్భాలలో నిర్వహించే సర్వే సమయంలో సర్వేయర్ల పాత్ర మరువలేనిదని అన్నారు. భూములకు సంబంధించి సర్వేయర్లు వివిధ రకాల సర్వే నిర్వహించాల్సి ఉంటుందని, ప్రభుత్వ భూముల సర్వే, అసైన్డ్ భూముల సర్వే, ప్రాజెక్టుల సందర్భంగా భూసేకరణకు సంబంధించి నిర్వహించే సర్వే , ఎఫ్ లైన్ సర్వే వంటి సర్వేల సమయంలో సర్వేయర్లు ముఖ్యపాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు. ప్రత్యేకించి రెవెన్యూ కు సంబంధించి గ్రామాలు, మండలాల అంతర్గత సరిహద్దుల నిర్ణయం లో, అలాగే అంతర్గత సరిహద్దుల వివాదాల పరిష్కారానికి నిర్వహించే సర్వే విషయంలో సర్వేయర్లది కీలక పాత్ర అని అన్నారు. అందువలన సర్వేయర్లు శిక్షణకు హాజరై జాగ్రత్తగా అన్ని అంశాలను క్షుణ్ణంగా విని అర్థం చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ లైసెన్స్డ్ సర్వేయర్ల కు సర్వే సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.