ఏజెన్సీలో భారీగా గంజాయి పట్టుకున్న పోలీసులు
– గంజాయిపై ప్రత్యేక నిఘా – ఒకరి అరెస్ట్
– చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదు
– ఏటూరునాగారం ఏఎస్పీ మహేష్ బాబా సాహెబ్ గీతే
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో 4 లక్షల విలువైన గంజాయిని పట్టుకొని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ మహేష్ బాబా సాహెబ్ గీతే వివరాలను వెల్లడించారు. మండల కేంద్రములోని అటవి శాఖ చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలంలోని గుండాల కాలనీ గ్రామానికి చెందిన పిల్లం వీర్రాజు (29) తండ్రి సోమరాజు వృత్తిరీత్యా పెయింటర్ గా పనిచేస్తు నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న క్రమంలో అనుమాన స్పదంగా పోలీసులను చూసి పారిపోతుండగా నిందితుడిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేపట్టారు. తనికీల్లో దాదాపు నాలుగు లక్షల విలువైన 16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితుడిని శనివారం పోలీసులు రిమాండ్ కు తరలించారు.ఈ సందర్భంగా ఏఎస్పి మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు ఏజెన్సీ లో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశామని అన్నారు.నిషేధిత మత్తు పదార్థాలు వాడినా, తరలించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అంతేకాకుండా గంజాయి మాఫియా మత్తులో చిత్తవుతున్న యువతపై ప్రత్యేక నిఘా పెట్టి వారిపై దృష్టి సారించామన్నారు.చాపకింద నీరులా విస్తరిస్తున్న గంజాయి, డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో గ్రామాలలోకి మత్తు వాసనలు రాకుండా పట్టిష్ట చర్యలు చేపడుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం సిఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై ఎస్కే తాజుద్దీన్, హెడ్ కానిస్టేబుల్ రామారావు పోలీసులు గోపి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.