ముగిసిన మినీ మేడారం జాతర

ముగిసిన మినీ మేడారం జాతర
– మేడారంలో కొనసాగుతున్న పారిశుధ్య పనులు
తాడ్వాయి, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం మినీ జాతర శనివారంతో ముగిసింది. ఈనెల 12న ప్రారంభమైన జాతరలో కన్నెపల్లి, మేడారంలో సమ్మక్క, సారలమ్మ ఆలయాల్లో శుద్ధి పూజలు నిర్వహించారు. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే మహాజాతర అనంతరం మినీ జాతర జరుపడం ఆనవాయితీగా వస్తోంది. వనదేవతల పూజారులు, వడ్డెలు శనివారంతో దేవతల మందిరాల్లో అంతర్గత పూజలు నిర్వహించడంతో మినీ జాతర ముగిసింది. నాలుగు రోజులు సందడిగా జరిగిన మేడారం, బయ్యక్కపెట, ఐలాపూర్ జాతరకు సుమారు 10లక్షల వరకు భక్తులు తరలివచ్చారని అధికారులు వెల్లడిం చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంత్రి సీతక్క ఆదేశాలతో కలెక్టర్ దివాకర టీఎస్ సౌకర్యాలు కల్పించారు. ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. జాతర నిర్వహణలో అధికారుల పాత్ర గొప్పదని దేవదాయ శాఖ ఈవో రాజేంద్ర తెలిపారు. శనివారం రోజున భక్తులు అధిక సంఖ్యలో వనదేవతలను దర్శించుకున్నారు. ముందుగా జంపన్న వాగులో జల్లుల స్నానాలు చేసి గద్దెల వద్దకు శివసత్తుల పూనకాలతో భక్తులు డోలు వాయి ద్యాలు నడుమ గద్దెలకు చేరుకొని పసుపు, కుంకుమ, చీర, సారే, ఎత్తు బంగారం (బెల్లం) ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
– బయ్యక్కపేటలో వనం చేరిన తల్లి
సమ్మక్క పుట్టుపూర్వంగా కొలుచుకుంటున్న తాడ్వాయి మండ లం బయ్యక్కపేటలో సమ్మక్క తలపతులు, వడ్డెలు సమ్మక్క గద్దె నుంచి డోలు వాయిద్యాల నడుమ సమ్మక్క తల్లిని వన ప్రవేశం గావించారు. చందవంశీయులు రఘుపతిరావు, గోపాలరావు, పరమయ్య, కళ్యాణ్ కుమార్, కృష్ణమూర్తి, స్వామి, తలపోతుల స్థానంలో వడ్డెలు సిద్ధబోయిన చలమయ్య కృష్ణా రావు, సమ్మయ్య దేవతను వనం చేర్చారు. కాగా, జాతరలు జరిగిన ప్రాంతాల్లో అధికారులు పారిశుధ్య పనులను ముమ్మరం చేశారు.