అంగరంగ వైభవంగా అమ్మవారి శరన్నవరాత్రుల మహోత్సవాలు.
అంగరంగ వైభవంగా అమ్మవారి శరన్నవరాత్రుల మహోత్సవాలు.
- తరలివచ్చిన అశేష భక్తజనం
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : విజయదశమి పండగ పర్వదినం సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రుల మహోత్సవాలు మంగళవారంతో అంగరంగ వైభవంగా ముగిసాయి. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలంలో అనేక గ్రామాల్లో ఆయా ఉత్సవ కమిటీలు అమ్మవారి శరన్నవరాత్రుల మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో,మంగళవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని అమ్మవారి దేవాలయం వద్ద నిర్వహించారు. అమ్మవారి అన్నప్రసాద స్వీకరణకు వందలాది మంది భక్తులు తరలివచ్చి అన్నప్రసాద కార్యక్రమం లో పాల్గొన్నారు. విజయదశమి దసరా మహోత్సవాల ముగింపు సందర్భంగా అనేక దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు తో దేవాలయాలన్నీ కిటకిటలాడాఇ. బెస్తగూడెం గ్రామంలోని శ్రీ వినాయక స్వామి వారి ఆలయం , వెంకటాపురంలోని శివాలయం,శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుండి స్వామివారు ప్రత్యేక పల్లకిలో విజయదశమి సందర్భంగా జమ్మి పూజా మహోత్సవాలకు, తరలివెళ్లి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో విజయదశమి జమ్మి పూజా కార్యక్రమంలో స్వామివారు ఊరేగింపు సేవలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే వెంకటాపురం మండల కేంద్రంలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అందంగా అలంకరించిన ట్రాక్టర్ పై అమ్మ వారిని ప్రతిష్ఠ చేసి వెంకటాపురం పట్టణ పురవీధులలో భాజా భజంత్రిలు, భక్తుల కోలాటాలు తో అమ్మవారి జయ,జయ ధ్వనాల మధ్య మంగళవారం రాత్రి ప్రధాన వీధులలో అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారి ని స్వాగతించి పసుపు కుంకాలు కొబ్బరికాయలు ఇతర కానుకలతో స్వాగతించి, పురోహితులు ఆశీర్వచనాలను పొందారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ భక్తులకు పులిహార, ఇతర ప్రసాదాలను పంపిణీ చేశారు. వెంకటాపురం, వాజేడు మండలాల్లో అనేక గ్రామాల్లో శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవ నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా జరిగాయి. బతుకమ్మల పండుగ, మరుసటి రోజుశ్రీ కనకదుర్గ అమ్మవారి మహోత్సవాలు వరుసగా రావడంతో గ్రామాల్లో భక్తిరస, భక్తిపారవశ్య సందడి నెలకొన్నది.