మిల్లుకు చేరాల్సిన ధాన్యం పక్కదారి..!
మిల్లుకు చేరాల్సిన ధాన్యం పక్కదారి..!
– డీసీఎం, ఆటోలను పట్టుకున్న రైతులు
– పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి: ఆరుగాలం శ్రమించిన రైతన్న లకు పంటను విక్రయించి డబ్బులు తీసుకునే వరకు కష్టాలు, నష్టాలు తప్పడం లేదు. నకిలీ విత్తనాలు, కల్తీ మందులు, కాంటాలలో మోసం, తేమ పేరుతో దగా… ఇలా అడుగడుగునా ఎదురయ్యే సమస్యలను అధిగమించడం అన్నదాతకు తలకు మించిన భారంగా మారుతోంది. సోమవారం రాత్రి నల్లగుంట గ్రామంలో ఐకెపి సెంటర్ నుండి మిల్లుకు చేరాల్సిన ధాన్యం బస్తాలను మధ్యలో వాహనం నుంచి ఆటోలోకి మార్చి తరలిస్తుండగా రైతులు పట్టుకున్న తీరును చూస్తే మరో కొత్త మోసానికి తెరతీసినట్లు కనిపి స్తోంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం… నల్లగుంట గ్రామానికి చెందిన పేర్ల శ్రీనివాస్ అనే రైతు కు చెందిన ధాన్యం నల్లగుంట ఐకెపి సెంటర్ నుంచి డీసీఎం ద్వారా వెలుతుర్లపల్లి లోని రైస్ మిల్ కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో నల్లగుంట -పాలంపేట గ్రామాల మధ్య డీసీఎం వ్యాన్ డ్రైవర్, ఆటో వ్యక్తితో కలిసి ధాన్యాన్ని కాజేస్తున్న ట్లు అనుమానం వచ్చిన కొందరు రైతులు నాలుగోసారి డీసీఎం వెళ్తుండగా కిలోమీటర్ కు ఒక రైతును కాపలా పెట్టి డీసీఎం నుంచి ఆటోలోకి 8 బస్తాలను ఎక్కించిన తర్వాత రైతులంతా ఒక్కసారిగా అక్కడికి వెళ్లారు. దీంతో డీసీఎం డ్రైవర్ పారిపోగా ఆటో డ్రైవర్ను పట్టుకున్నారు. దీనిపై వెంకటాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు రైతులు తెలిపారు. ధాన్యం బస్తాలను దొంగిలించడంలో ఎవరెవరి పాత్ర ఉందో పోలీసు విచారణలో తెలియనుంది. కాగా ఇప్పటికే కాంప్రమైజ్ కోసం మంతనాలు జరుగుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా రైతుల శ్రమ దోపిడీ కి పాల్పడే ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని తోటి రైతుల కోరుతున్నారు.