సన్నబియ్యం పంపిణీనీ పకడ్బందీగా పర్యవేక్షించాలి

సన్నబియ్యం పంపిణీనీ పకడ్బందీగా పర్యవేక్షించాలి

సన్నబియ్యం పంపిణీనీ పకడ్బందీగా పర్యవేక్షించాలి

 – అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

– ప్రతీ నెల సకాలంలో సజావుగా పంపిణీ జరగాలి

– కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి ఉత్తమ్ కుమార్, సీ.ఎస్ శాంతికుమారి

నిజామాబాద్, ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : దేశంలోనే మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ పథకాన్ని పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారితో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సన్నబియ్యం పంపిణీపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేద కుటుంబాలకు చెందిన వారు కూడా నాణ్యమైన సన్నబియ్యంతో కూడిన భోజనం చేయాలనే బృహత్తర సంకల్పంతో ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. సుమారు 13వేల కోట్ల రూపాయల భారం పడుతున్న ప్పటికీ, పేద కుటుంబాల కోసం ఈ పథకాన్ని చేపట్టిందని అన్నారు. ఈ పథకం ద్వారా ‘ఆహార భద్రత’ను ఆచరణాత్మక రూపంలో కల్పించినట్లు అయ్యిందని, రాష్ట్రంలోని సుమారు 80 నుండి 84 శాతం మంది నిరుపేదలకు ఉచితంగా సన్నబియ్యం అందుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. దీని ఔన్నత్యాన్ని గుర్తిస్తూ, అన్ని జిల్లాలలో ప్రతీనెలా సజావుగా సన్న బియ్యం పంపిణీ జరిగేలా అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. ఇదివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 40 రూపాయలు పైగా కిలో బియ్యానికి వెచ్చించి ప్రజలకు ఉచితంగా బియ్యం సరఫరా చేశాయని, 70 నుంచి 80 శాతం వరకు ఆ బియ్యాన్ని ప్రజలు తినేవారు కాదని, రీసైక్లింగ్ ద్వారా కోళ్ల ఫారాలకు, ఇతర అవసరాలకు తరలి వెళ్లేదని మంత్రి అన్నారు. ప్రస్తుతం సన్న బియ్యం పంపిణీ విజయవంతం అవుతోందని, ప్రజలు సంతోషంతో స్వీకరిస్తున్నారని అన్నారు. కాగా, రేషన్ దుకాణాలకు బియ్యం నిల్వలు సకాలంలో చేరుకునేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, రవాణాపర మైన ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో కూడిన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి రేషన్ డీలర్ వద్ద ఆహార భద్రత కార్డులలోని సభ్యుల సంఖ్యకు అనుగుణంగా పూర్తి స్థాయిలో సన్న బియ్యం నిల్వలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సన్నబియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తి పారద ర్శకంగా జరగాలని, ఎక్కడైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటనకు హాజరు కానున్నారని, ఈ సందర్భంగా సన్నబియ్యం స్వీకరించిన దళిత గిరిజన కుటుంబాలతో కలిసి సీఎం భోజనం చేస్తారని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సన్నబియ్యం పథకం ప్రాముఖ్యతను చాటేలా జిల్లాలలో కూడా వీలైతే ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించి, నిరుపేదల ఇళ్లలో, కాలనీల్లో వారితో కలిసి సన్నబియ్యంతో వండిన భోజనం చేయాలని, పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, డీసీఓ శ్రీనివాస్, మెప్మా పీ.డీ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment