దేశంలో బిజెపి సాగిస్తున్న నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలి
– రాహుల్ గాంధీ ఆలోచనలు, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలపై అవగాహన కల్పించండి
– యువజన కాంగ్రెస్ నాయకులకు మంత్రి శ్రీధర్ బాబు దిశా నిర్దేశం
కాటారం, తెలంగాణ జ్యోతి : దేశంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సాగిస్తున్న నియంతృత్వ పాలనకు చరమగీతం పాడేందుకు రాహుల్ గాంధీ ఆలోచనలు, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని యువజన కాంగ్రెస్ నాయకులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచించారు. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర బాల వికాస కేంద్రంలో నిర్వహిస్తున్న “వైట్ టీ షర్ట్” శిక్షణా శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శిం చారు. అనంతరం యువజన కాంగ్రెస్ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. రాహుల్ గాంధీ అత్యంత ప్రతిష్టాత్మంగా చేపట్టిన “వైట్ టీ షర్ట్” ఉద్యమం చాలా గొప్పదన్నారు. కరుణ, ఐక్యత, అహింస, సమానత్వం, అందరికీ పురోగతి లాంటి అయిదు మార్గదర్శకాలకు “వైట్ టీ షర్ట్” చిహ్నంగా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి యువజన యువజన కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక అన్నారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా యువజన కాంగ్రెస్ అవతరించిందన్నారు. ఆ స్ఫూర్తితో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు, రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ హరివర్ధన్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు వజ్రేష్ యాదవ్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ సయ్యద్ ఖలీద్, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి శ్రవణ్ రావు, నాయకులు నితీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.