రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యం
– ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదానికి పిలుపు..
– అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశ సమాజం క్షమించదు..
– జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని క్షేత్ర స్థాయిలో బలంగా తీసుకెళ్ళాల్సిన అసవరం ఉంది..
– చెల్పూర్ లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
జయశంకర్ భూపాలపల్లి, తెలంగాణ జ్యోతి : రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదానికి పిలుపు ఇచ్చినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం రోజున భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం చెల్పూర్ మేజర్ గ్రామ పంచాయతీలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి , కాటారం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు. ముందుగా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూల మాల వేశారు. అనంతరం పీఏసీఎస్ కార్యాలయం నుండి బస్టాండ్ కూడలిలోని గాంధీ విగ్రహం వరకు పాదయాత్రగా చేరుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… మన దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేడు పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని, ప్రధానికి పేద ప్రజల కంటే బడా బాబులు ముఖ్యమన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేడ్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథమన్నారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు. అమిత్ షా అంబెడ్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించారన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. గాంధీ అంబెడ్కర్ ఆశయాలను సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.