ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం ములుగు జిల్లా వెంకటాపురం,వాజేడు మండలాల దేవాలయాల్లో వేకువ జాము నుండే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు బారులు తీరగా దేవాలయాలు కిటకిట లాడాయి. మండల కేంద్రమైన వెంకటాపురం లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దేవాదాయ శాఖ, ఆలయ కమిటి ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు మధ్య స్వామి వారు పల్లకి సేవలో అశేష భక్త జనావళికి దర్శన భాగ్యం కల్పించారు. పురవీధులలో మంగళ వాయిద్యాల మధ్య కాగడాల వెలుతురులో స్వామివారి పల్లకి సేవకు భక్తులు నీరాజనాలు పలుకుతూ శుద్ధి జలంతో స్వాగతం పలికారు. అదేవిధంగా శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం, శ్రీ కనక దుర్గమ్మ ఆలయం, బెస్తగుడెంలోని ఇష్టపురి శ్రీ వినాయక ఆలయం, శ్రీ రామలయంతో పాటు అనేక దేవాలయాల్లో శుక్రవారం వేకువ జాము నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిం చారు. భద్రాచలంలో జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ఈ ప్రాంతం నుండి వందలాది మంది భక్తులు గురువారం నుండే భద్రాచలం తరలి వెళ్లారు.