కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం
– కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ లు వెంటనే రాజీనామా చేయాలి
– మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సాదు నర్సింగరావు
చెన్నారావుపేట, తెలంగాణ జ్యోతి : చెన్నారావుపేట మం డల కేంద్రంలోని మాలమహానాడు ముఖ్య కార్యకర్తల సమా వేశాన్ని మండల అధ్యక్షుడు కడగండ్ల యాకయ్య అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సాదు నర్సింగారావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ “పేరు గొప్ప ఊరు దిబ్బ” లాగా ఉందన్నారు. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 48 లక్షల 21 వేల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు మినహాయిస్తే తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వక పోవడం చాలా బాధాకరమన్నారు. బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం, బడ్జెట్లో ములుగు గిరిజన యూనివర్సిటీకి అదనపు నిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ మరియు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన ఊసే లేదన్నారు. బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని వాడలేదని మిత్రపక్ష రాష్ట్రాలైన బీహార్ ఆంధ్రప్రదేశ్ కు భారీగా నిదులిచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మరిచారన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆత్మ గౌరవంపై దెబ్బతీసిందని, అయినా బిజెపి ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని, తెలంగాణ ప్రజలు బిజెపికి 8 సీట్లు ఇస్తే కేంద్రం తెలంగాణకు మాత్రం ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. ఇది ముమ్మాటికి కక్షపూరిత రాజకీయమేనని, దానికి కారణమని బిజెపి ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం పై ప్రేమ లేదని దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి బండి సంజయ్ లు రాజీనామా చేయాలనీ కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు ఆశోద నర్సింగం, ఈద విజయేందర్, భక్కి కుమారస్వామి, కోడి కృష్ణకర్ తదితరులు పాల్గొన్నారు.