Telangana : తెలంగాణ మహిళల కోసం అమలు కానున్న మరో పథకం..!!

Telangana : తెలంగాణ మహిళల కోసం అమలు కానున్న మరో పథకం..!!

డెస్క్ :  మహిళలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ మహిళల కోసం మరో రెండు గ్యారంటీల అమలు కు నిర్ణయించారు. ఈ నెల 12న జరిగే కేబినెట్ సమావేశంలో అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో..ఈ లోగానే పథకాలను ప్రారంభించాలని నిర్ణయించారు. మహిళ లకు నెలకు రూ.2,500 ఆర్థికసాయం పథకం అమలుకు రేవంత్ డిసైడ్ అయ్యారు. రేపు ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించనున్నారు.

*మరో రెండు గ్యారంటీల అమలు*

తెలంగాణలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీ లను హామీగా ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగింటిని ప్రారంభించింది. మిగిలిన రెండు గ్యారెంటీలను అమలు చేయటానికి రంగం సిద్ధం చేసింది. రేపు (సోమవారం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకాన్ని ప్రారంభించ నున్నారు. మంగళవారం సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో దాదాపు లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళ లతో నిర్వహించనున్న భారీ సదస్సులో.. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థికసాయం పథకంపై సీఎం కీలక ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే ప్రజాపాలన ద్వారా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఎంత మంది లబ్దిదారులు ఉన్నారు.. ఎంత మేర ఆర్దిక భారం పడుతుందనే అంశం పైన అంచనాకు వచ్చారు.

*మంత్రివర్గ భేటీలో నిర్ణయం*

ఈ నెల 14 లేదా 15వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో, ఈ నెల 12న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మహాలక్ష్మి పథకం కింద రూ 2500 చొప్పున అందించే భృతి అమలు పై నిర్ణయం ప్రకటించనున్నారు. అదే రోజు పరేడ్‌ గ్రౌండ్స్‌ సభలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించనున్నారు. లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలతో ప్రభుత్వం నిర్వహించనున్న ఈ సదస్సులోనే.. మహిళలకు వడ్డీ లేని రుణాలిచ్చే అంశంపైనా సీఎం ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. దీనిపైనా క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు చికిత్స, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాలను ప్రారంభించింది.

*కీలక నిర్ణయాల దిశగా*

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున అందించే పథకం అమలుపై సంబంధిత అధికారులు కసరత్తు వేగవంతం చేసారు. ఈ సారి మంత్రివర్గ సమావేశంలో ఎమ్మెల్సీల నియామకం పైన నిర్ణయం తీసుకోనున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు స్థానంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసాను తీసుకు రానుంది. ఈ మేరకు పథకం అమలులో కొన్ని మార్పులు చేయాలని భావిస్తోంది. ధరణి పోర్టల్‌లో సమస్యలు, లే-అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(ఎల్‌ఆర్‌ఎస్‌) తదితర అంశాలూ క్యాబినెట్‌ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే, లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకోవటం పైనే రేవంత్ గురి పెట్టారు. దీంతో, ఎన్నికల ముందు జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో తీసుకొనే నిర్ణయాల పైన ఉత్కంఠ నెలకొంది.