చత్తీస్గడ్ సరిహద్దు అడవుల్లో టేకు కలప పట్టివేత
వెంకటాపురంనూగూరు,తెలంగాణజ్యోతి:చత్తీస్గడ్ సరిహద్దు వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని సూరవీడు బీటు, ఎదిర సెక్షన్ అడవుల్లో అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన 10 టేకు దుంగలను వెంకటాపురం ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ అధికారి వంశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం ఆధారం గా చత్తీస్గడ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహించి 10 టేకు దుంగలను స్వాధీనం చేసుకొని వెంకటాపురం ఫారెస్ట్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. ఈ కలప విలువ సుమారుగా రూ. 3 లక్షల 71 వేలుగా ఉంటుందని పేర్కొన్నారు. చత్తీస్గడ్ అడవుల్లో టేకు చెట్లను నరికి ముక్కలు చేసి తరలించేందుకు స్మగ్లర్లు సిద్ధం చేసారనే సమాచారం అందిన వెంటనే అధికారులు ఈ చర్యలు చేపట్టామన్నారు. ఈ దాడుల్లో ఎదిర సెక్షన్ ఆఫీసర్ జై సింగ్, సూరవీడు సౌత్ బీట్ ఆఫీసర్ స్వర్ణలత, సూరవీడు సెక్షన్ ఆఫీసర్ చంద్రమోహన్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.