సీనరేజి నిధులు గ్రామపంచాయతీ లకు కేటాయించాలి
– కలెక్టర్ ని కోరిన ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి.
– డిఎం ఎఫ్టీ విధానం ద్వారా ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాలకు నష్టం జరుగుతోంది
– రాజు పేట, కత్తి గూడెం ఇసుక క్వారీలో జరుగుతున్న అక్రమాల పైన విచారణ చేపట్టాలి
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి : ఏజెన్సీ ప్రాంతం నుండి ఇసుక ద్వారా ప్రతినెలా 460 కోట్ల రూపాయలు, ఏడాదికి మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వెళ్తున్న ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాలకు ఎటువంటి ప్రయోజనం లేదని, ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి ఆరోపించారు. సోమవారం నర్సింహా మూర్తి ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ ను, గ్రీవెన్స్ లో కలిసి పలు సమస్యల పైన మెమోరాండం అందజేశారు. ఆయా వివరాలను సోమవారం వెంకటాపురంలో మీడియాకు విడుదల చేశారు. గతంలో ఇసుక నిర్వహణ ద్వారా వచ్చే ముప్పై శాతం సీనరేజి ప్రభావిత గ్రామపంచాయతీ లకు వచ్చేదని, తద్వారా ఏజెన్సీ గ్రామాల అభివృద్ధి జరిగేదని కలెక్టర్ కి ఆయన వివరించారు. డిస్ట్రిక్ట్ మినరల్ ట్రస్ట్ ఫండ్ లో కలపడం కారణంగా, ఇసుక ద్వారా వచ్చిన సీనరేజి నిధులను జిల్లా మొత్తం కేటాయించడం సరికాదని తెలిపారు. రాజు పేట, కత్తి గూడెం ఇసుక రిచుల్లో రేజింగ్ కాంట్రాక్టర్ ల ఆగడాలకు హద్దులు లేకుండా పోతున్నాయని, కే.జీ ఎఫ్ సినిమాని తలిపించే విధంగా గోదావరిలో అనేక అక్రమాలు జరుతున్నందున, ఆ ఇసుక క్వారీలను తక్షణమే నిలుపుదల చేయాలనీ కలెక్టర్ ను కోరారు. దీని పైన కలెక్టర్ దివాకర్ వెంటనే స్పందించి తక్షణమే క్వారీలను నిలుపుదల చేసి ,విచారణ చేపట్టాలని టిఎస్ఎండిసి పి.ఓ. శ్రీరాములు ని ఆదేశించారు. వెంకటాపురం మండలం జెల్లా కాలని గ్రామం లో అంగన్వాడీ నూతన భవనం నిర్మాణం మొదలు పెట్టి రెండు సంవత్సరాలు అయినా ఇంతవరకు పూర్తి చేయలేదని అన్నారు.అంగన్వాడీ విద్యార్థులు బిల్డింగ్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని కలెక్టర్ కు తెలియ జేశారు. సి. ఎం గిరివికాస్ పథకం నిరూపయోగంగా మారిందని అన్నారు. గిరిజన రైతుల నుండి ముప్పై నుండి యాభై వేల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని కలెక్టర్ దివాకర్ కు తెలిపారు. రెండు ఏళ్ల క్రితం నూగూరు వెంకటాపురం మండలంలోని , బర్లగూడెం పంచాయతీ గిరిజన రైతులకు బోర్లు వేసి, విద్యుత్తు సరఫరా, మోటార్లు ఇవ్వడం అధికారులు మరచి పోయారని ఆయన తెలిపారు. రెండేళ్ల నుండి వేసిన బోర్లు వాడకం లో లేకపోవడం తో పూడిక వస్తున్నాయని అన్నారు. మండలం లోని చిరుత పల్లి -2 బాలికల ఆశ్రమ పాఠశాల పాత వసతి గృహం ధ్వంసం అయిపోతోందని అన్నారు. భవనం పై కప్పు నుండి పెచ్చులు ఊడి పిల్లల మీద పడి విద్యార్థులు కు గాయాల పాలు అవుతున్నట్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పాత వసతి గృహానికి నూతన పాఠశాల భవనానికి దూరం ఉండటం తో విద్యార్థులు రోజు రాకపోకలతో ఇక్కట్లకు గురి అవుతున్నారని తెలిపారు. నూతన పాఠశాల భవనం లోకి చేర్చి అక్కడే అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ ని కోరినట్లు మీడియాకు తెలిపారు. గత ఏడాది వేసిన ఎల్ .టి .ఆర్ కేసుల్లో ఎటువంటి పురోగతి లేదన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇప్పటి వరకు ఎటువంటి విచారణ చేపట్టలేదని తెలిపారు. అన్ని విషయాల పైన సానుకూలంగా స్పందించిన కలెక్టర్ దివాకర్ అన్ని సమస్యలు పరిష్కరిస్తా మని హామీ ఇచ్చారు. త్వరలోనే ఏజెన్సీ గ్రామాలను సందర్శించి సమస్యలు తెలుసుకుంటా అని అన్నారు. ఎల్ .టి .ఆర్ కేసులు అన్ని జడ్జిమెంట్ లు వచ్చేలా చర్యలు చేపడతాను అని, ఎల్ టి ఆర్ పెండింగ్ కేసుల వివరాలు అన్ని అందుబాటులో ఉంచాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు.