విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలి
విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలి
– మంచికి దగ్గరగా..చెడుకు దూరంగా ఉండాలి :కాళేశ్వరం ఎస్సై చక్రపాణి
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : కాళేశ్వరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు కాళేశ్వరం ఎస్సై చక్రపాణి ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నూతన చట్టాలు ,సైబర్ నేరాలపై విద్యార్థు లకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ వాడకం వల్ల సమాజంలో వచ్చే దుష్పరిణామాలు, ఆరోగ్య సమస్యల గురించి ఎస్సై చక్రపాణి విద్యార్థులకు వివరించారు. చాలామంది యువత సరదాగా మొదలుపెట్టిన ఈ అలవాటు వ్యసనంగా మారి వారి భవిష్యత్తును నాశనం చేస్తుందని కాబట్టి విద్యార్థులు అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు. డ్రగ్స్, గంజాయి,మత్తు పదార్థాలు, గుట్కాలు యువత అలవాటు చేసుకోని ఆరోగ్యం పాడుచేసుకోవద్దని ఎస్సై తెలిపారు. యువత దేశానికి పట్టుకొమ్మలని వారు మంచి ఆలోచనలు కలిగి ఉండాలని సమాజాభివృద్ధికి తద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడాలని విద్యార్థులకు సూచించారు. ఒక వ్యక్తి డ్రగ్స్ కి అలవాటు అయితే మాన్పించడం చాలా కష్టమని డ్రగ్స్ వినియోగం వల్ల ఆ వ్యక్తి ఏం చేస్తాడో తనకే తెలియదని, మత్తులో నిద్రిస్తాడని, క్రూరమైన ఆలోచనలు కలిగి ఉంటాడని తెలియజేశారు. విద్యార్థులు తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు అనుమానం వచ్చినా, విక్రయిస్తున్నట్టు తెలిసిన పోలీసులకు సమాచారం అందిచాలని అప్పుడు మాత్రమే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థులు, సామాన్య ప్రజలు పోలీసు వారికి తమ వంతు సహాయ, సహకారాలు అందించాలని సూచించారు. కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని సమాజం ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుందని తెలియజేశారు. విద్యార్థులందరూ తమ తోటి విద్యార్థులతో సోదరభావంతో మెలగాలని, సత్సంబంధాలు ఏర్పరచు కోవాలని తెలిపారు. మంచికి దగ్గరగా,చెడుకు దూరంగా ఉండాలని, విద్యార్థులు మంచి ఆలోచనలతో చదివి ఉన్నత శిఖరాలను అదిరోహించాలని ఎస్సై చక్రపాణి అన్నారు. అదేవిధంగా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయరాదని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పాటించవలసిన రహదారి నియమ నిబంధనలను విద్యార్థులకు వివరణాత్మకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, పాఠశాల ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.