నిమజ్జనానికి కాళేశ్వరం గోదావరి ఘాట్ వద్ద పటిష్ఠ ఏర్పాట్లు
– గణేష్ శోభాయాత్ర, నిమజ్జనంలో భక్తులు నిర్లక్ష్యం వహించొద్దు
– అధికార యంత్రాంగం సూచనలు తప్పక పాటించాలి
– జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.
– జిల్లా నలుమూలలతో పాటు వరంగల్, ములుగు జిల్లాల నుండి విగ్రహాలు వచ్చే అవకాశం.
– 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణేషులు
– సోమ, మంగళవారాల్లో గంగమ్మ ఒడికి తరలనున్న గణనాథులు
– నిమజ్జన ఏర్పాట్లు పూర్తి పటిష్ఠ పర్యవేక్షణ
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి నవ రాత్రి ఉత్సవాలను భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. పల్లె, పట్టణాల్లో భక్తి పార వశ్యంతో ఆది దేవుడిని పూజించారు. నవరాత్రి ఉత్సవాలు ముగియనుండడంతో సోమ, మంగళవారం రోజులలో జిల్లా లో వినాయక నిమజ్జనోత్సవ వేడుకలు జరగనున్నాయి.జిల్లా నలుమూలల నుంచే కాక వరంగల్, ములుగు వంటి దూర ప్రాంతాల నుండి విగ్రహాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. నిమజ్జన పర్యవేక్షణ ప్రత్యేక అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏటా కాళేశ్వరం వద్ద నిమజ్జనం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యాన భక్తులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ నిమజ్జన ఉత్సవాలను ఆనందంగా ముగించేలా అధికారులకు, పోలీ సులకు సహకరించాలని సూచించారు. పర్యవేక్షణకు జిల్లా అధికారులకు విధులు కేటాయించినట్లు తెలిపారు. తగు జాగ్ర త్తలు పాటిస్తే గణనాధుని నిమజ్జన కార్యక్రమాలను ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు. విగ్రహాలను యంత్రాంగం నిర్దేశించిన ప్రాంతాల్లోనే నిమజ్జనం చేయాలని కలెక్టర్ రాహు ల్ శర్మ స్పష్టం చేశారు.
నిమజ్జనంలో భక్తులు పాటించాల్సిన అంశాలు
నిమజ్జన శోభాయాత్రలో గణనాధులను తీసుకెళ్లే వాహనాల డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పొరపాట్లు జరగకుండా అనుభవజ్ఞులైన డ్రైవర్లను ఎంచుకుని వారికి తగిన సూచనలివ్వాలి. డ్రైవర్ మద్యం, మత్తు పానీయాలు, పదార్థాలకు దూరంగా ఉండాలి. డ్రైవర్ పక్కన, వాహనం ముందు భాగంలో ఎవరినీ కూర్చోనివ్వకూడదు. అలాగే, ప్రతిమ వద్ద ఎక్కువ మంది ఉండకుండా చూసుకోవాలి. రహదారులపై గుంతలు, విద్యుత్ తీగల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
శోభాయాత్రలో జాగ్రత్తలు
ఉత్సవ సమితి బాధ్యులు, భక్తులు, పోలీసుల సూచనలు పాటించాలి. శోభాయాత్రలో పూర్తిగా సంయమనం పాటించాలి. యువకులు ఎలాంటి ఉద్వేగాలకు గురవకుండా క్రమపద్ధతి పాటించాలి. విగ్రహాలను మండపం నుంచి వాహనంపైకి చేర్చే సమయాన విద్యుత్ తీగల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. సెట్టింగుల సమీపంలో బాణాసంచాలు పేల్చకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
నిమజ్జన సమయంలో
నిమజ్జన సమయంలో అధికార యంత్రాంగం ఏర్పాటు చేసే క్రేన్లు, తదితర వాటి సమీపంలోకి వెళ్లకూడదు. పోలీసులు, నిమజ్జనం చేసే సదరు నిర్వాహకుల హెచ్చరికలు కాదని భక్తులు నీటిలోకి దిగేందుకు ప్రయత్నం చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లలోకి దిగకూడదు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు పూర్తిస్థాయిలో సామరస్య పూర్వక వాతావరణం ఉండేలా చూడాలి. నిర్వాహకులు శాంతి, సామరస్య పూర్వకంగాఉండాలి. ప్రధానంగా ఊరేగింపు సమయంలో ఆధ్యాత్మిక చింతన ప్రజ్వరిల్లేలా మన సంస్కృతి, సంప్రదాయాల భక్తి పాటలు, నృత్యాలు, కోలాటాలు పెట్టుకోవాలి. విగ్రహాలను తరలించే వాహనాల కండీషన్ సరిగా ఉండేలా చూడాలి. విగ్రహాలను ఘాట్ల వద్దకు కాకుండా వేరేచోట్లకు తీసుకెళ్లొద్దు. గుంపులుగా, పిల్లలతో రావొద్దు. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా పోలీసు సిబ్బందికి సహకరించాలి. ఈ టెలి కాన్ఫరెన్స్ లో నిమజ్జన పర్యవేక్షణ ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.