అఘాయిత్యానికి పాల్పడిన బిజెపి నేతపై కఠిన చర్యలు తీసుకోవాలి
– బాలిక కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేయాలి.
– సి.జి.బీజాపూర్ ఎమ్మెల్యే విక్రమ్ మండవి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్త గూడెంలో చత్తీస్గడ్ నుండి మిరప పండ్ల కోతకు వలస వచ్చిన ఆదివాసి మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన బిజెపి నేతపై కఠినంగా శిక్షించి, బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని ఛత్తీస్గడ్ రాష్ట్రం బీజాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్ మండవి డిమాండ్ చేశారు. శుక్రవారం బీజాపూర్ నుండి ప్రత్యేక పోలీసు బందోబస్తుతో తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కుమార్ ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్లు, ప్రత్యేక పోలీస్ సిబ్బంది సి.జి పోలీసులతో కలిసి బందోబస్తు నిర్వహించారు. బీజాపూర్ ఎమ్మెల్యే వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్అండ్బి అతిథి గృహంలో స్థానిక నాయకులను కలుసుకొని, కేసు పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కుమార్ ను కేసు వివరాలను, రిజిస్టర్ చేసిన వివిధ సెక్షన్లను, జరిగిన సంఘటన పై ప్రత్యేకంగా వివరాలకు అడిగి తెలుసుకొని కేసును పకడ్బందీగా నమోదు చేసి కఠినంగా శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని సి.ఐ.ను కోరారు. తొలిసారిగా వెంకటాపురం మండలానికి బీజాపూర్ కాంగ్రేస్ ఎమ్మెల్యే రావటంతో వెంకటాపురం మండల కాంగ్రెస్ నాయకులు శాలువలతో ఘనంగా సత్కరించారు. అనంతరం బీజాపూర్ ఎమ్మెల్యే విక్రమ్ మండవి బెస్తగూడెం గ్రామానికి వెళ్లి బాలికను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారందరికీ మనోధైర్యం కల్పిస్తూ, భుజం తట్టి అండగా మేము అంతా ఉంటామని, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, అఘాయిత్యానికి పాల్పడిన బిజెపి నేత రాజశేఖర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులకు, పోలీసు అధికారులకు, సి.ఎంకు లేఖ రాసినట్లు తెలిపారు. కుటుంబం యావత్తు మనోధైర్యంగా ఉండాలని ఎటువంటి భయాంధోళన లు చెందవలసిన అవసరమే లేదని, సి.జి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజాపూర్ ఎమ్మెల్యే వెంట, చత్తీస్గడ్ కాంగ్రెస్ నాయకులు బసంతారావు తాటి, నీనావుద్దే, సునీల్ ఉద్దీ, కాకా భాస్కర్, శంకర్, తదితరులు సి.జి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వెంకటా పురం మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ పిఎసిఎస్ అధ్యక్షులు చిడెం మోహన్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం సాంబశివరావు, మాజీ జడ్పిటిసి పాయం రమణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాలసాని వేణు, మన్యం సునిల్,శ్రీ రాముల రమేష్, అన్వర్, మాజీ ఎంపీటీసీలు సీతాదేవి, రవి లతో పాటు పలువురు నాయకులు పాల్గొ న్నారు.