మినీ మేడారంలో భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు
– జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతర ఈనెల 12 నుంచి 15 వరకు జరుగుతుండగా భారీ బందోబస్తు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ పి.శబరీష్ తెలిపారు. వెయ్యి మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పర్యవేక్షిస్తామన్నారు. మంగళవారం మేడారంలో నిర్వహించిన సమీక్షలో పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సుమారు 1000 మంది మినీ జాతరలో బందోబస్తు డ్యూటీలు వేవామని, ములుగుతోపాటు ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల నుంచి పోలీసు సిబ్బంది హాజరవుతున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ కంట్రోల్ లో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం డైవర్షన్ పాయింట్లు, పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేశామని, రోడ్లమీద పార్కింగ్ చేయకుండా ఎప్పటికప్పుడు సమీక్షించే విధంగా బైక్ పెట్రోలింగ్ పార్టీలను ఏర్పాటు చేశామన్నారు. డ్రోన్, కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తామన్నారు. అనుకోని సందర్భంలో ఏదైనా వెహికల్ సమస్య వలన ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే వెంటనే ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడానికి వీలుగా జెసిబిలను, టోయింగ్ వెహికల్స్ ను సిద్ధంగా ఉంచారు. మేడారంకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, గద్దెల వద్ద బందోబస్తు చేసే సిబ్బంది భక్తులతో సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి నేరాలు జరగకుండా మఫ్టీలలో విధులు నిర్వహిస్తారని, ఎటువంటి దొంగతనాలు జరగకుండా నిత్యం పహారకాస్తామన్నారు. జాతర సందర్భంగా వివిఐపీలు దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు ఓఎస్డీ మహేష్ గీతే, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ సదానందం, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
1 thought on “మినీ మేడారంలో భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు”