ఎమ్మార్పీఎస్ పోరాటంతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైంది
– ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మంతెన చిరంజీవి
కాటారం, తెలంగాణ జ్యోతి: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి( ఎమ్మార్పీఎస్) ద్వారా పోరాటంతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని కాటారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మంతెన చిరంజీవి పేర్కొన్నారు. గురువారం కాటారం మండల కేంద్రంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణ పై తీర్పు ఇవ్వడంతో బాణాసంచా పేల్చి సంబరాలు జరిపారు. మాదిగ జాతి కొరకు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అలుపెరుగని పోరాటం చేసి అనేక కేసులను ఎదుర్కొని మాదిగ జాతి బతుకులు మారాలని అకుంఠిత దీక్షతో దశాబ్దాల కాలంగా మాదిగల ఐక్యం చేస్తూ మాదిగ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన పోరాట యోధుడని పేర్కొన్నారు. తన జీవితాన్ని మాదిగ ఉద్యమానికి అంకితం చేసి వర్గీకరణ సాధించేవరకు తన పోరాటాన్ని కొనసాగించి వర్గీకరణ సాధనకు కృష్ణ మాదిగ దిక్సూచి అయినారని తెలిపారు. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పు మాదిగ జాతి అంతా హర్షం వ్యక్తం చేసిందని మాదిగ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి చిరంజీవి ఉద్యమ నమస్కారాలను తెలిపారు