పచ్చి దాన్యం పేరుతో దళారులదోపిడి..!

పచ్చి దాన్యం పేరుతో దళారులదోపిడి..!

– ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పోటీగా దళారుల హవా

– పడికట్టు తో కాంటాలు. 

– కింటాలుకు రూ. 1600 లకే యదేచ్ఛగా గిరిజన దోపిడీ. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి :  ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పోటీగా దళారులు, వడ్డీ వ్యాపారులు, ఎరువులు పురుగుమందుల డీలర్లు, ఆంధ్ర ప్రాంత దళారులు, రైతులు వద్ద పచ్చిధాన్యం పేరుతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు పోటీగా ప్రభుత్వ అనుమతులు లేకుండా జీరో వ్యాపారంతో కింటాలు కు రూ. 1,600 లకే కొనుగోలు చేసి రైతులను దోచుకుంటున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో బరకాలపై ధాన్యం ఆరబోసి వారం పది రోజులు తేమ శాతం వచ్చేవరకు ఎదురుచూడాలని, ఈ లోపల వర్షం పడితే తడిసి పోతాయని, ప్రభుత్వం కొనుగోలు చేసిన తర్వాత నెల రోజులు వరకు డబ్బులు ఇవ్వరని, అంతే కాక మిల్లర్లు కటింగులు వుంటాయని, ఇబ్బందులు పాలు అవుతారని రైతులను రైతు దళారి దోపిడి దొంగలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.మీ వరి పొలాలు మా యంత్రాలతో  కోస్తాం మీరు గట్టు మీద నిలబడండి అంతా మేము చూసుకుంటామని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై తప్పుడు ప్రచారం చేస్తూ, రెండు మండలాల్లో రోజుకు వెంకటాపురం, వాజేడు మండలం లో ఎటువంటి రవాణా అనుమతులు లేకుండా పచ్చి ధాన్యం పేరుతో రోజుకు 30 లారీలకు పైగా ధాన్యం అక్రమ రవాణా సాగుతుంది. కాంటా రాళ్లతో కాంటాలు వేయకుండా పడికట్టు కనికట్టు తో రెండు మూడు కిలోలు ఎక్కువగా తూకం వేసి దోపిడీ చేస్తున్నారు. రైతులను చైతన్యపరిచి దళారులకు ధాన్యం విక్రవించవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని, నూగూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బంది కరపత్రాల ద్వారా దళారి దోపిడిని అరికట్టేందుకు, రైతులను చైతన్య పరచ వలసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చర్ల కార్యదర్శి, సిబ్బంది దళారులు వద్ద, సీజనల్ మాముళ్ళు మాట్లాడుకుని, రైతాంగ దోపిడీకి సహకరిస్తున్నారని ఆరోపణలు వెళ్లివెత్తుతున్నాయి. అంతే గాక తూనికల కొలతల అధికారులు సైతం సీజనల్ మామూ ళ్ళతో ఈ ప్రాంతంపై కన్నెత్తి చూడటంలేదని, పలువురు విమర్శిస్తున్నారు. అంతర్రాష్ట్ర రవాణా అరికట్టేందుకు, వాజే డు మండలం చెరుకూరు వద్ద చెక్పోస్టును ఏర్పాటు చేయగా, దొంగ ధాన్యం లారీలు చెక్పోస్ట్ వద్ద, సిబ్బంది లంచాలు తీసు కొని ఇతర రాష్ట్రాలకు దొంగ రవాణాకు సహకరిస్తున్నారని ఆరోపణలు వున్నాయి. చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ తరఫున వాజేడు మండలం పూసూరు గోదావరి వంతెన వద్ద, చర్ల మండలం లో ఏ .ఎం. సి. చెక్ పోస్ట్ లు పనిచేస్తున్నాయి. రైతులను దోపిడీ చేస్తూ, రైతుల పేరుతోనే రవాణా పత్రాలు సృష్టించి, యధేచ్చగా గిరిజన దోపిడీకి పాల్పడుతున్న, సంబంధిత రెవెన్యూ, వ్యవసాయ మార్కెట్ కమిటీ, పౌర సరఫరాల విజిలెన్స్ విభాగం పట్టించుకోవడంలేదని విమర్శ లు గుప్పుమంటున్నాయి. వెంకటాపురం, వాజేడు మండలం లో ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో వాజేడు మండలంలో 8, వెంకటాపురం మండలంలో 5, అలాగే గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సన్న రకం ధాన్యానికి ప్రభుత్వ ధర 2,3 20 కాగా, రూ.500 రూపాయలు ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. దీంతో క్వింటాలు సన్నరకం 28 వందల ఇరవై రూపాయలకు కొనుగోలు చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. బి.గ్రేడ్ .2,300 రూ.లకు ప్రభుత్వ కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అంతేకాక కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు పకడ్బందీగా సౌకర్యాలు కల్పించాలని, ధాన్యం అకాల వర్షాలకు తడవకుండా టార్బల్ పట్టాలు ఏర్పాటు చేయాలని, గోనె బస్తాలు సరఫరా చేయా లని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే వెంకటాపురం, వాజేడు మండలాల్లో కొంతమంది దొంగ వ్యాపారులు పచ్చి ధాన్యం పేరుతో రైతుల పొలాల వద్దనే తెల్ల బస్తాలతో పచ్చిధాన్యం పేరుతో కాటాలు వేసి, రాత్రికి, రాత్రి రోజుకు 30 లారీల పైగా పచ్చిధాన్యం ఇతర జిల్లాలకు, రాష్రాలకు దొంగ రవాణా పత్రాలతో తరలించుకు పోతున్నారని గిరిజన సంఘాలు, రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ములుగు జిల్లా కలెక్టర్, జిల్లా ఫౌరసరఫరాల శాఖ, తూనికలు కొలతలు, పౌరసర ఫరాల శాఖ విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ధాన్యం గిరిజన దోపిడీకి అడ్డుకట్ట వేయా లని ఈ ప్రాంత రైతులు, సంఘాలు సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఈ ప్రాంత గిరిజన సంఘాల రైతులు సన్నా,సిన్న కారు రైతులు ముఖ్యమంత్రి, మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావుకు, ములుగు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు లు చేసినట్లు సమాచారం. రైతాంగ ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం, దళారుల దోపిడీ పై అధికారులు మౌనం వహించే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఏ.సి. బి.తో విచారణ జరిపించాలని ఏజెన్సీ రైతాంగం పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నది.