మూడు నెలల సన్నబియ్యం పంపిణీపై సమీక్ష
ములుగు ప్రతినిధి తెలంగాణ జ్యోతి : జూన్ నెలలో మూడు నెలల సన్నబియ్యం (జూన్, జూలై, ఆగస్టు) పంపిణీపై జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు మూడు నెలల సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా బియ్యం పంపిణీలో రవాణా కాంట్రాక్టర్లు, గోదాం ఇన్చార్జులు, డీలర్లు సమన్వయంగా పని చేయాలని ఆదేశించారు. డీలర్లు, లబ్ధిదారుల నుంచి మూడు సార్లు వేలిముద్రలు నమోదు చేయించి, ఒకేసారి మూడు నెలల సరుకు అందజేయాలని స్పష్టం చేశారు. మండల లెవెల్ స్టాక్ పాయింట్లలో హమాలీలను, బఫర్ గోదాముల్లో కాంటాలను సరిపడా ఉంచాలని సూచించారు. జిల్లా ప్రజలు జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ లోపు రేషన్ షాప్‌ల ద్వారా తగిన విధంగా మూడు నెలల బియ్యాన్ని తీసుకోవాలని కోరారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా పౌర సరఫరా అధికారులు, మండల తహసి ల్దారులు, సివిల్ సప్లై డిప్యూటీ తహసిల్దారులు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షిస్తూ, ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరస రఫర అధికారి సయ్యద్ షా పైసల్ హుస్సేన్, జిల్లా మేనేజర్ బి. రామ్ పతి (పౌరసరఫరాల సంస్థ), డివిజనల్ మేనేజర్ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఏటూరునాగారం వాని ఠాగూర్, జిసిసి మేనేజర్(వెంకటాపురం)స్వామి,డిప్యూటీతహసిల్దార్లు(ములుగు,ఏటూరునాగారం),మండల లెవెల్ స్టాక్ పాయింట్ ఇన్‌చార్జు లు, స్టేజ్ 1, 2 రవాణా కాంట్రాక్టర్లు, గోదాం ఇన్‌చార్జులు, జిల్లా లోని 9 మండలాల డీలర్ల సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు.