వడదెబ్బ లక్షణాలు గుర్తించి జాగ్రత్తలు వహించాలి
– గుత్తి కోయ కూలీలకు అవగాహన.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చెరుకూరు పంచాయతీలో శనివారం మిర్చి తోటల్లో పనిచేస్తున్న గుత్తి కోయ కూలీలకు వడదెబ్బ, వాటి లక్షణాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పేరూరు పిహెచ్సి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అవగాహన కల్పించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో భాగంగా చెరుకూరు పరిధిలో గల మిర్చి తోటలలో వలస వ్యవసాయ కూలీలకు వడదెబ్బ ఎందువల్ల వస్తుంది. వడదెబ్బ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. వడదెబ్బ నుండి నివారణ ఏ విధంగా తీసుకోవాలి చికిత్స ఏవిధంగా చేసుకోవాలనే అంశాలను వివరించారు. తలనొప్పి, జ్వరం, కళ్ళు తిరగడం, వాంతులు, విరేచనాలవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, మూత్రం పసుపు రంగులో రావడం వంటి లక్షణాలు ఉండి, చమట లేకుండా చర్మం ఎర్రగా కందిపోయి ఉంటే వడదెబ్బ అని గుర్తించాలన్నారు. వెంటనే దగ్గరలో ఉన్న వైద్య కేంద్రంకు వచ్చి చికిత్స తీసుకోవాలని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి వేణు గోపాలకృష్ణ, ఎమ్మెల్ పి. హెచ్ నవీన్, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.