ప్రైవేటు వైద్యులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి

ప్రైవేటు వైద్యులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి

– జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి జిల్లా ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు ప్రభుత్వ విధివిధానాలు పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శనివారం ఐడిఓసి కార్యాలయపు కాన్ఫరెన్స్ హాలులో ప్రైవేట్ ఆసుపత్రులు పాటించాల్సిన నియమ నిబంధనలు గురించి జిల్లా లోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు, వైద్యశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలను అనుసరించి వైద్య సేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రికి సంబంధించిన వివరాలు తెలుగు, ఇంగ్లీష్ భాషలలో వైద్య సేవలకు వసూలు చేయు ధరల పట్టిక, వైద్య సిబ్బంది వివరాలు, టెస్టుల వివరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.. ఐ.ఈ.సి ద్వారా అందించే పోస్టర్ ను ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేయాలని అన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టవ్యతిరేకమని, చేయకూడదని స్పష్టం చేసారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సంబంధించిన వివరాలు కేసు షీట్ లో నమోదు చేయాలన్నారు. ప్రసూతి, చిన్నారుల వైద్య సేవల వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలని అన్నారు. సీజనల్ వ్యాధులు గురించి ప్రస్తావిస్తూ డెంగీ, మలేరియా, టిబి వ్యాధి గ్రస్తుల రికార్డులను నమోదు చేసి నివేదిక ప్రభుత్వానికి అందించాలని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు సేవా దృక్పథంతో పని చేయాలని సూచించారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాల నిర్ధారణ పరీక్షలు కేవలం రక్త పరీక్షలు, ర్యాపిడ్ టెస్ట్ ద్వారా కాకుండా జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన టీ హబ్ లో ఎలిశా టెస్ట్ ద్వారా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్దారణ చేయాలని తెలిపారు. ప్రభుత్వం డెంగీ కేసులల్లో తప్పుడు నివేదికలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దని సూచించారు. కచ్చితంగా డెంగీ నిర్ధారణ జరిగితే స్థానిక పంచాయితీ, మున్సిపల్, వైద్యాధికారులకు సమాచారం అందించాలని అన్నారు. వ్యాధి నిర్దారణ ఆధారంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణ, కమ్యూనిటీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వ్యాధి వ్యాప్తి జరుగకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తనిఖీ అధికారులు ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేస్తారని, తనిఖీలో నిబంధనలు ఉల్లంఘన జరిచినట్లు నిర్దారణ జరిగితే ఆసుపత్రులను సీజ్ చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్యులు ప్రయివేటు ఆసుపత్రులను తనిఖీ చేయాలని ఆదేశించారు. తనిఖీలో వైద్య సేవల ధరల పట్టిక, చికిత్స పొందిన వ్యక్తుల కేసు షీట్ లను పరిశీలించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.