సిపిఎం 4వ రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరణ
– సిపిఎం రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి
తెలంగాణజ్యోతి, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో సిపిఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ భారతీయ మండల కమిటీ ఆధ్వర్యంలో వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి దావూద్ మండల కార్యదర్శి చిటమట రమేషు మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి పేద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భారాన్ని మోపుతూ నడ్డి విరుస్తుందని అన్నారు. అదే కాక అనేక సంవత్సరాలుగా ఈ లౌకిక దేశంలో రామ్ రహీం రాబర్ట్ అనే మతాల మధ్యన తేడా లేకుండా అన్నదమ్ముల భావంతో ఉన్న ప్రజల మధ్యన మతోన్మాద చిచ్చు పెడుతూ రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తూ రాజ్యాంగాన్ని రద్దుచేసి మను ధర్మాన్ని అమలు చేయాలని చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 25 నుండి 28 వరకు సిపిఎం రాష్ట్ర 4వ మహాసభలు సంగారెడ్డి పట్టణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభలో పేదలు, రైతులు, కూలీలు, అసంఘటిత కార్మికులు, నిరుద్యోగులు, ఉద్యోగులు మధ్య తరగతి ప్రజలు, మహిళలు, యువజనలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని పేర్కొన్నారు. మేధావులు అన్ని వర్గాల ప్రజలు సహకరించి పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఇట్టి మహాసభకు అఖిలభారత కోఆర్డినేటర్ ప్రకాష్ కారత్, పొలిటి బ్యూరో సభ్యులు బి వి రాఘవులు హాజరుకానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు ఎండి యాకూబ్, బాలాజీ, రమేష్, ఎండి అంకుశవల్లి, వసంత నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.