Pochampally | ములుగులో కాంగ్రెస్ కు బిగ్ షాక్…
- సీతక్క నామినేషన్ రోజే పార్టీని వీడిన మహిళా అధ్యక్షురాలు
తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క నామినేషన్ దాఖలు చేసిన రోజే ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు బీఆర్ఎస్ లో చేరడం చర్చనీయాంశం గా మారింది. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీ ని వీడి బీఆర్ఎస్ లో చేరుతుండటం, కాంగ్రెస్ శ్రేణులు కూడా భారీ సంఖ్యలో బీఆర్ఎస్లోకి వలసలు వస్తుండడంతో ములుగు కాంగ్రెస్ నాయకత్వానికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. ములుగు నియోజకవర్గ ఇంచార్జి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ రావు , రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ సమక్షంలో పార్టీలో చేరగా, ములుగు ఎన్నికల ఇంచార్జ్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో సిఎం కేసీఅర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందని ధనలక్ష్మి తెలిపారు. ఇప్పటివరకు సీతక్క చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యువజన నాయకులు రమేష్, జిల్లా కోఆప్షన్ సభ్యులు వలీ బాబా, పార్టీ సీనియర్ నాయకులు ప్రదీప్ రావు లు ఉన్నారు.