కొడుకు జ్ఞాపకాలతో తల్లిదండ్రుల చేయూత
– ములుగు జిల్లా ఆస్పత్రికి ఫ్రీజర్ అందజేత
– 100మంది రోగులకు అన్నదానం
తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : అనారోగ్యంతో గత ఏడాది కొడుకు మృతిచెందగా అతని జ్ఞాపకార్థం పుట్టిన రోజు ఆ దంపతులు చేయూత అందించారు. ములుగు పట్టణానికి చెందిన పొగాకుల కవిత సునీల్ గౌడ్ దంపతుల కుమారుడు రమణ కుమార్ గత ఏడాది సెప్టెంబర్ 22న తీవ్ర జ్వరంతో మృతి చెందాడు. అయితే రమణ కుమార్ 24 వ పుట్టిన రోజు మంగళవారం కావడంతో జిల్లా ఆస్పత్రికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి బాడీ ఫ్రీజర్ బహుకరణగా అందజేశారు. తమ కొడుకు రమణ కుమార్ ఆకస్మిక మరణం తమ కుటుంబానికి తీరని వ్యద కలిగించిందని, ప్రతీ పుట్టిన రోజున ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. కొడుకు జ్ఞాపకార్థం రూ.75వేల విలువగల ఫ్రీజర్ ఆస్పత్రికి అందించమని సునీల్ గౌడ్ తెలిపారు. అదేవిధంగా 100 మంది రోగులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ండెంట్ జగదీష్, గైనిక్ స్పెషలిస్ట్ పూజారి రఘు, బాబాయ్ పిన్ని పొగాకుల అనిల్ శోభరాణి, అత్తమ్మ మామయ్యలు బొమ్మగాని హైమావతి జగదీశ్వర్, బావలు బొమ్మగాని శ్రీనివాస్, ప్రభాకర్, కృష్ణ ప్రసాద్, సోదరులు భారత్ కుమార్, రంజిత్, అఖిల్, రవితేజ, స్నేహితులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.