పస్ర చెక్ పోస్ట్ వద్ద పల్టీ కొట్టిన కారు
– బ్రేక్ వేయబోయి ఎక్స్ లేటర్ తొక్కిండు
– నలుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
– హైదరాబాద్ నుంచి మల్లూరు వెళ్తుండగా ఘటన
ములుగు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా గోవింద రావుపేట మండలం పస్ర చెక్ పోస్ట్ వద్ద కారు పల్టీ కొట్టిన సంఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… స్నేహితుడి పెళ్లికి పోవాలనే హడావుడి, ముందుగా దైవ దర్శనం చేసుకోవాలనే తొందరలో వెళ్తూ బ్రేక్ వేయబొయి ఎక్స్ లేటర్ తొక్కడంతో కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర – తాడ్వాయి మధ్యలోని చెక్ పోస్ట్ వద్ద శనివారం తెల్లవారు జామున 5.30 గంటలకు జరిగింది. చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న అటవీ సిబ్బంది ప్రమాదాన్ని గమనించి అందులో ప్రయాణిస్తున్న వారిని 108 లో ములుగు ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ కు చెందిన మహేష్, సంపత్, జ్ఞానేశ్వర్, భరత్ లు స్నేహితుని వివాహం కోసం కరీంనగర్ కు వెళ్లాల్సి ఉంది. అయితే ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు లో గల ప్రముఖ పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని అనంతరం కరీంనగర్ వెళ్దామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఎస్ ఎల్ 6 కారులో మల్లూరు వెళ్తుండగా పసర చెక్పోస్ట్ వద్ద కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. మిగతా ముగ్గురు స్వల్పంగా గాయ పడ్డారు. భరత్ కారు నడుపుతున్నట్టు సమాచారం. చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న బీట్ అధికారి కృష్ణ, బేస్ సిబ్బంది రాజు, సాయి లు బాధితులను 108 ద్వారా ములుగు ఆసుపత్రికి తరలించారు.