పేదవారి కళ్ళల్లో ఆనందం చూడడమే మా ప్రభుత్వ లక్ష్యం.
పేదవారి కళ్ళల్లో ఆనందం చూడడమే మా ప్రభుత్వ లక్ష్యం.
– ఈనెల 11న పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం.
తెలంగాణ జ్యోతి/ మహాదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలో సాయంకాలం ముక్తేశ్వర శుభానంద దేవీల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు.అనంతరం శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివార్లను కోరుకున్నాను. ఈరోజు కళ్యాణం జరిగిన సందర్భంలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆశీస్సులు పొందటానికి శివరాత్రి పర్వకాలంలో కాళేశ్వరానికి విచ్చేసిన తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసిన భక్తులందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధికెక్కింది. ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినాన ఈ ఆలయానికి రావడం మా ఆనవాయితీ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాములో ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం.శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర దేవస్థానానికి భక్తులు తాకిడి పెరగడంతో, అనుగుణంగా సౌకర్యాలను ఏర్పాటు చేయ డానికి ప్రణాళికలను రూపొందిస్తున్నాం. దేవాలయానికి సంబంధించిన అభివృద్ధి పనులలో దాతలు సహకరించాలని కోరారు. శివ భక్తులు ముందుకు వచ్చి ఈ దేవాలయ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంత రైతులకు సంబంధించి రాబోయే కాలంలో ఒక ప్రధానమైన సాగునీటి ప్రాజెక్టు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మా కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న బడ్జెట్లో కూడా ప్రత్యేకంగా ముందుకు తీసుకువెళ్లాలని చర్చించాం. రాబోయే 12 నెలల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం కై కార్యాచరణ చేపడతాం. ఆరు హామీలలో నాలుగు పథకాలను ఇప్పటికే అమలులోకి తీసుకోవచ్చాం, త్వరలో మిగతా హామీలను అమలులోకి తీసుకువచ్చేలా ప్రయత్నాలను చేస్తున్నాం.11వ తేదీ నాడు పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించనుంది. పేదవారి కళ్ళల్లో ఆనందం చూడడమే మా ప్రభుత్వ ఆలోచన. శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ప్రణాళిక బద్దంగా ముందుకు పోతున్నాం, రెట్టింపు వేగంతో మేము ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం అన్నారు.