మొక్కజొన్న రైతులకు న్యాయం జరగకపోతే జాతీయ ఎస్టీ కమిషన్ రంగంలోకి దిగుతుంది

మొక్కజొన్న రైతులకు న్యాయం జరగకపోతే జాతీయ ఎస్టీ కమిషన్ రంగంలోకి దిగుతుంది

మొక్కజొన్న రైతులకు న్యాయం జరగకపోతే జాతీయ ఎస్టీ కమిషన్ రంగంలోకి దిగుతుంది

– జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్

వెంకటాపురంనూగూరు,తెలంగాణజ్యోతి: నకిలీ మొక్కజొన్న విత్తనాలతో నష్టపోయిన గిరిజన రైతాంగానికి న్యాయం జరగకపోతే జాతీయ ఎస్టీ కమిషన్ కూడా రంగంలో దిగుతుందని, గిరిజన రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే విధంగా ములుగు జిల్లా అదికార యంత్రాంగం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ అధికారులను ఆదేశించారు. శనివారం ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం చిరుతపల్లిలో బహుళ జాతి నకిలీ మొక్కజొన్న విత్తనాలతో సాగు చేసి పంట నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ ములుగు జిల్లా కలెక్టర్ దివాకర, ఐటిడిఏ పిఓ లతో కలిసి పరామర్శించారు. ప్రభుత్వ పరంగా వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని  అధైర్య పడవద్దని వారికి మనోధైర్యం కల్పించారు. అనంతరం చిరుతపల్లి గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ఆవరణలో జరిగిన సమావేశంలో ములుగు జిల్లా అన్ని శాఖల అధికారులతో పాటు, మొక్కజొన్న రైతులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నకిలీ మొక్కజొన్న విత్తనాలు కారణంగా నష్టపోయిన రైతాంగం పడే ఇబ్బందులను, ఆత్మహత్యలను ఉద్యమకారుడు, ఆదివాసీ నవనిర్మాణ సేన వ్యవస్థాపక అధ్యక్షులు కొర్స నరసింహమూర్తి వివరించారు. ఏఎన్ఎస్ నేత, న్యాయవాది నాగరాజు మాట్లాడుతూ గిరిజన రైతుల మొక్కజొన్న కష్టాలను మరియు గిరినేతర భూస్వామ్య వర్గ దోపిడీని యాకరువు పెట్టారన్నారు. ప్రభుత్వ భూములను సైతం అక్రమంగా ఆక్రమించుకొని పట్టాలు చేయించుకుంటు న్నారని, మొక్కజొన్న కంపెనీ ఆర్గనైజర్లు కోట్లాది రూ దోపిడీకి పాల్పడుతూ రైతుల ఆత్మహత్యలకు కారకులయ్యారని, వారందరిపై పిడి యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.  అలాగే మండలంలో విద్యాసంస్థలకు భూములు కేటాయించాలని సమావేశంలో కోరారు. గిరిజన నాయకులు మొక్కజొన్న రైతులు, మిచ్చా వెంకటమ్మ, ప్రవీణ్, రాంబాబు ఇంకా పలు రైతులు సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ అమాయక గిరిజనులను ఆసరగా చేసుకొని కొన్ని కంపెనీల యజమానులు నకిలీ విత్తనాలు సరఫరా చేసి అన్ని విధాలుగా నష్టం చేశారని, విత్తనాలను పంపిణీ చేసిన కంపెనీ యాజమాన్యాలు నకిలీ విత్తనాలను పంపిణీ చేసింది వాస్తవమేనని ఒప్పుకొన్నారని, నేటి వరకు నష్టపరిహారం చెల్లించుకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గత కొద్ది రోజుల క్రితం పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించిన అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని, ఆదివాసి గిరిజనులు నష్టపోతున్న క్రమంలో జిల్లా యంత్రాంగం ఏ చర్యలు తీసుకుందన్నారు. ఇప్పటికైనా జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన రైతులను వివరాలను సేకరించి తక్షణమే నష్టపరి హారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నామమాత్రంగా నష్టపరిహారం చెల్లించకుండా పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించాలన్నారు. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ మొక్కజొన్న రైతుల ఆందోళనలపై ప్రత్యేక దృష్టి సారించామని నష్ట పొయిన రైతులందరికీ పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు మొక్కజొన్న పంటలను పరిశీలించేందుకు జిల్లా వ్యాప్తంగా బహుళ జాతి మొక్కజొన్న, నకిలీ మొక్కజొన్న విత్తనాలతో సాగుచేసిన మండలాల్లో 9 వ్యవసాయ శాఖ సంబంధించిన టీం లు ఏర్పాటు చేశామని తెలిపారు. 950 మంది రైతులు 2,300 ఎకరాలలో సాగు చేసినట్లు నివేదిక అందిందన్నారు.  ముగ్గురు ఆర్గనైజర్లపై పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కేసులు నమోదయ్యాయని, మరో ముగ్గురు పై కూడా త్వరలో కేసులు నమోదు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. అలాగే నష్టపోయిన మిగతా రైతులకు కూడా తమ పేర్లు నమోదు చేసుకునేందుకు మరో పది రోజులు గడువు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సభా ముఖంగా ప్రకటించారు. నష్టపోయిన రైతుల వివరాల నమోదుకు ఈ నెలాఖరు వరకు సమయాన్ని ఇవ్వాలని జాతీయ ఎస్టి కమిషన్ సభ్యులు సూచించారు. పంట నష్టపోయిన రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని పూర్తిస్థాయిలో నష్ట పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా,  ఆర్డిఓ వెంకటేష్, ఎమ్మార్వో లక్ష్మీ రాజనర్సు , జిల్లా సివిల్ సప్లై అధికారి ఫైజల్ హుస్సేన్, విద్యుత్ శాఖ అధికారి నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, రైతులు, ఆయా సంబందిత అధికారులు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బీ. కుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీస్ అధికారులు బందోబస్తు నిర్వహించారు.

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment