ఘనంగా నాగులమ్మ చవితి పండుగ
– పుట్టల వద్ద భక్తుల సందడి
– పుట్టకలుగుల్లో ఆవుపాలతో ప్రసాదాల జారవిడుపు
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి : పవిత్ర కార్తీక మాసం లో నాగుల చవితి పండగ సందర్భంగా మంగళవారం ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లోని అనేక దేవాలయాలు భక్తులతో కిట కిటలాడాయి. వేకువ జామునే భక్తులు, గృహిణులు నాగులమ్మ దేవతకు గ్రామాల సమీపం లో ఉన్న పుట్టల వద్ద కలుగులో ఆవుపాలతో నాగేంద్రుడికి ఇష్టపూర్వకమైన ప్రసాదాలను జారవిడిచారు. ఈ సందర్భం గా పుట్టలపై కల్లాపులు జల్లి అందమైన ముగ్గులు వేసి పుష్పాలతో పుట్టలను అలంకరించారు. ఆవు పాలతో చలిమి డి, నువ్వులతో తయారుచేసిన మిఠాయి, కోడిగుడ్డు, వడ పప్పు, క్షీరాన్నం తదితర ప్రసాదాలను పుట్టకలుగుల్లో ఆవు పాలతో జార విడిచారు. చల్లంగా చూడమ్మ తల్లి నాగులమ్మ, పాడిపంటలు సక్రమంగా పండాలని దీవించమ్మ, సకల జను లు సుఖశాంతులతో ఉండాలని ఆశీర్వదించమని భక్తులు వేడుకున్నారు. వెంకటాపురం మండల కేంద్రంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం, వెంకటేశ్వరస్వామి వారి ఆలయం, శ్రీఆంజనేయస్వామి, కనకదుర్గమ్మ గుడి, గణేష్ మండపాల వద్ద, శ్రీరామ టెంపుల్ తదితర దేవాల యాల వద్ద భక్తులు వేకువజామనే పూజలు నిర్వహించారు. కార్తీక సోమవారం, మరుసటి రోజు మంగళవారం నాగుల చవితి పండగల సందర్భంగా అత్యంత పవిత్రమైన రోజులుగా ఏజెన్సీ ప్రాంతం లో భక్తి శ్రద్ధలతో పండుగను ఘనంగా నిర్వహించారు.