Mulugu : ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్
Mulugu : ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్
– గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు
– మావోయిస్టు కీలక నేత బద్రు సహా ఏడుగురు మృతి
– చల్పాక సమీప అటవీ ప్రాంతంలో ఘటన
– ఘటనా స్థలంలో రెండు ఏకే 47, రైఫిల్స్ స్వాధీనం
– ఎన్‌కౌంటర్‌లో హతమైన ఇల్లందు – నర్సంపేట ఏరియా కమిటీ సభ్యులు
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి: జిల్లాలోని ఏటూరు నాగారం చల్పాక అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున 6 గంటల సమయంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కూంబింగ్ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. పిఎల్ జిఏ వారోత్సవాల నేపథ్యంలో తెలంగాణ గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ లో భాగంగా చల్పాక పూలకొమ్మ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు కుర్సుం మంగు అలియాస్ బద్రు అలియాస్ పాపన్న, జిల్లా కమిటీ సభ్యుడు ఏగోలపు మల్లయ్య అలియాస్ కోటి, ఏరియా కమిటీ సభ్యురాలు జమున, ఏరియా కమిటీ సభ్యులు కరుణాకర్ లుగా గుర్తించారు. ఇంకా ముగ్గురిని గుర్తించాల్సి ఉంది.
భద్రు కోసం ఏళ్లుగా అన్వేషణ…
గతంలో ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల యాక్షన్ టీం కమాండర్ గాను పనిచేసిన భద్రు 2022లో 20 రోజులు తాడ్వాయి అరణ్యంలో సంచరిస్తున్నట్టు నిఘా వర్గాలు నాడు పసిగట్టాయి. ఆ సమాచారంతో స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలు అడవిని జల్లెడపట్టాయి. వీరాపూర్ అటవీ ప్రాంతంలో దళాలు సేదతీరుతున్న సమయంలో పోలీసులు అక్కడికి చేరుకునేందుకు యత్నిస్తుండగా సెంట్రీ టీం అప్రమత్తమైంది. మావోయిస్టులు డెన్ను ఖాళీ చేసే క్రమంలో నిత్యావసరాలు, సామగ్రిని వదిలేసి వెళ్లారు. అయితే కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అతి సమీపం లోకి రావడంతో కాల్పులు ప్రారంభించారు. పోలీసులు కూడా ఫైరింగ్ కు దిగారు. సుమారు 15 నిమిషాలపాటు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. పోలీసులకు చిక్కకుండా భద్రు టీం తప్పించుకుంది. ప్రస్తుతం పిఎల్ జిఎ వారోత్సవాల నేపథ్యంలో ములుగు జిల్లా ఏటూరునాగారం, వాజేడు, నూగూరు వెంకటాపురం అడవుల్లో మావోయిస్టు దళాలు సంచరిస్తున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ క్రమంలో పెనుగోలు ఘటన తర్వాత పోలీసు బలగాలు కూంబింగ్ ను తీవ్రతరం చేసి స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలు అడవిని జల్లెడపడుతున్నాయి. అయితే ఈసారి మాత్రం పోలీసులు పక్కా వ్యూహంతో మావోయిస్టులపై తుపాకీ తూటాలతో దాడి చేయగా మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లింది.
అంతా యువరక్తమే..!
మృతి చెందిన ఏడుగురు మావోయిస్టులలో 24 ఏళ్లలోపు ఉన్నవాళ్లు ఐదుగురు ఉండటం గమనార్హం. దశాబ్దన్నరకాలం తర్వాత ములుగు జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్ ఇదే. పోలీసు ఇన్ ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారనే నెపంతో గత నెల 21 అర్ధరాత్రి సమయంలో ములుగు జిల్లా వాజేడులో పెనుగోలు కాలనీలో పేరూరు పంచాయతీ కార్యదర్శి ఉయికా రమేశ్, ఆయన సోదరుడు ఉయికా అర్జున్ను మావోయిస్టులు హతమార్చారు. వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్య దర్శి శాంత పేరిట మావోయిస్టులు రెండు లేఖలను మృత దేహాల వద్ద వదిలి వెళ్లారు. ఈ ఘటన ములుగు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఏటూరునాగారంలో ఆదివాసీలు మావోయిస్టు లకు వ్యతిరేకంగా ర్యాలీ సైతం నిర్వహించారు. శనివారం ఏటూరునాగారం, వెంకటపూర్, వాజేడుల్లోనూ మావోయిస్టు లకు వ్యతిరేకంగా బ్యానర్లు వెలిశాయి.
ములుగు మార్చురీకి చేరుకున్న మృతదేహాలు.
ఏటూరునాగారం చల్పాక అటవీ ప్రాంతం నుంచి పటిష్ట బందోబస్తు నడుమ ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి మావోయిస్టుల మృతదేహాలు తరలించారు. ఎన్కౌం టర్ జరిగిన ప్రాంతంలో ఉదయం నుండి సాయంత్రం వరకు రెవెన్యూ అధికారుల సమక్షంలో పోలీసులు పంచ నామా పూర్తి చేశారు. సోమవారం ములుగు ఏరియా ఆస్ప త్రిలో మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యు లకు పోలీసులు అప్పగించనున్నారు. మావోయిస్టు మృతదేహా లకు ఆస్పత్రి వద్ద గట్టి బందోబస్తు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా అనుమానితులను క్షుణ్ణంగా పోలీసులు తనిఖీ చేస్తున్నారు.