ములుగు జిల్లా ఎటూ పోదు.. ప్రతిపక్షాలు దుష్ప్రచారం మానుకోవాలి… 

ములుగు జిల్లా ఎటూ పోదు.. ప్రతిపక్షాలు దుష్ప్రచారం మానుకోవాలి… 

– ఏండ్లుగా కొట్లాడి తెచ్చుకున్న జిల్లాను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకుందాం

– రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి సీతక్క స్పష్టత

ములుగు, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: ఏళ్ల తరబడి కొట్లాడి సాధించుకున్న ములుగు జిల్లాను తొలగిస్తారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికల అనంతరం పూర్తిస్థాయిలో జిల్లాను అభివృద్ధి చేసుకుందామని రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమశాఖా మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) స్పష్టం చేశారు. ములుగు జిల్లా కోసం మూడేళ్లుగా అన్నివర్గాల ప్రజలతో కలిసి పోరాటం చేస్తే వచ్చిన జిల్లాపై కావాలని తొలగిస్తారని బురద చల్లడం అవివేకమని పేర్కొన్నారు. మంగళవారం ములుగు క్యాంపు కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీతక్క మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని సీతక్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో రైతుల రుణమాఫీ, వ్యవసాయ ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ళు, విద్యార్థులకు ఫీజు రియింబర్స్, వైద్య విధానంలో ఉన్నత ఫలాలను అందించిన ఘనత తమకే దక్కుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ ప్రజా పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై దుష్ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామన్నారు.

– ములుగు జిల్లాపై అవాస్తవాలు ప్రచారం చేయొద్దు. 

ములుగు జిల్లా సాధన కోసం ఎమ్మెల్యేగా ఉన్న తాను సబ్బండ వర్గాల ప్రజలు ఏకమై పోరాటాలు చేసి సాధించుకున్నామని, జర్నలిస్టుల పాదయాత్రతో 2016 డిసెంబర్ 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు జిల్లా ఆత్మగౌరవ సభకు హాజరయ్యారని గుర్తు చేశారు. అయితే ప్రతిపాక్షలు మాత్రం జిల్లా పోతుందని అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేసత్ఉన్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం ములుగును జిల్లాగా ప్రకటిస్తూ జీవో జారీ చేసినప్పటికీ తమ కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లా అభివృద్ధికి కావాల్సిన నిధులను కేటాయిస్తున్నామన్నారు. మల్లంపల్లి మండలాన్ని కూడా అభివృద్ధి చేసుకుందామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏరోజు కూడా ములుగు జిల్లాను తరలించే ఆలోచన చెయ్యలేదని పేర్కొన్నారు. మల్లంపల్లి మండలం, ఏటూరునాగారం డివిజన్ పై గత పాలకులు ఎలాంటి జీవో, గెజిట్ ఇవ్వలేదని, భవిష్యత్తులో తాము ఏర్పాటు చేసి అభివృద్దికి కృషి చేస్తామననారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.