Mulugu | రాష్ర్ట వ్యాప్తంగా రూ.21వేల కోట్ల రుణమాఫీ చేసినం
– పోడు, పడావు భూములకు రైతుబంధు ఎందుకు?
– గత పాలకుల నిర్లక్ష్యంతో రెన్యువల్ కాక రైతులు ఇబ్బందులు పడ్డరు
– సాగయ్యే భూములకు రైతు భరోసా కల్పిస్తాం
– ములుగు జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
– రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క
– ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట మండలాల్లో రూ.17.98కోట్లతో రోడ్ల పనుల శంకుస్థాపనలు
ములుగు ప్రతినిధి : తెలంగాణ రాష్ర్టంలో రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, రాష్ర్ట వ్యాప్తం గా రూ.21వేల కోట్ల రుణమాఫీ చేపట్టిందని రాష్ర్ట పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమశాఖా మంత్రి దనసరి అనసూయ (సీతక్క) స్పష్టం చేశారు. పోడు, పడావు భూములకు రైతుబంధు ఇవ్వాలని గగ్గోలు పెడుతు న్నారని, సాగుచేసుకునే భూములకు పట్టాలు లేకపోవడంతో కొందరు రైతులకు లబ్ది చేకూరలే దన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగులో ఉండే ప్రతీ ఎకరానికి రైతు భరోసా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంగళవారం ములుగు జిల్లా ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేట మండలా ల్లో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి సీతక్క జిల్లా ఎస్పీ శబరీష్, అదనపు కలెక్టర్ సిహెచ్.మహేందర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ లతో కలిసి రూ.17.98కోట్లతో చేపట్టనున్న రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతీ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించ డమే ప్రభుత్వ లక్ష్యమని, రైతును రాజును చేయడమే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. మహిళల కు పెద్దపీట వేయడంతోపాటు ఆర్థికంగా, సామాజికంగా అభివృ ద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మండల కేంద్రాలకు అనుసంధానం చేస్తూ నూతన రోడ్లను ఏర్పాటు చేస్తున్నామని, ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలల భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. రూ.2లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేశారని, రానున్న రోజులలో రైతు బంధు అందించడంతో పాటు భూమిలేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి 12వేల రూపాయలు అందజే యడానికి ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 52 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించగా ములుగు జిల్లాలో 187మంది ఉపాధ్యా యులుగా, 40మంది పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యారని అన్నారు. గత పాలకులు చేసిన అప్పుల కారణంగా నేటి ప్రజా ప్రభుత్వం ప్రతి గంటకు మూడు కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని, అయినప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలను చేపడు తూనే సంక్షేమ ఫలాలను అర్హులకు అందిస్తున్నామని అన్నారు. ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి రూ.5లక్షలతో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించేందుకు సర్వే కొనసాగుతున్నదన్నారు. అనతరం మంగపేట మండలం కేంద్రంలో ఆర్ అండ్ బి రోడ్డు నుంచి పాత బ్రాహ్మణపల్లి వరకు రూ.90లక్షలతో, బ్రాహ్మణపల్లి క్రాస్ రోడ్డు నుంచి తిమ్మాపూర్ వయా దోమెడ వరకు రూ.4కోట్లతో, పీఆర్ రోడ్డు నుంచి నిమ్మగూడెం వరకు రూ.1.80కోట్లతో రోడ్డు నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కన్నాయిగడెంలో 27మంది, ఏటూరునాగారంలో 43మంది కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీఓ వెంకటేష్, పంచాయితీ రాజ్ ఈఈ అజయ్ కుమార్, తహసిల్దార్ రవీందర్, ఎంపీడీవో అనిత, ఎఫ్డీవో రమేష్, డీఎస్పీ రవీందర్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.