నేడు వనప్రవేశం చేయనున్న తల్లులు.
– నాలుగు రోజులపాటు వైభవంగా జరిగిన జాతర
మేడారం బృందం : నాలుగు రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగిన మేడారం మహా జాతర శనివారంతో ముగియనుంది. ఇవాళ సాయంత్రం వన దేవతలైన సమక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు వనప్రవేశం చేయనున్నారు. సమ్మక్కను చిలుకల గుట్టకు, సారలమ్మను కన్నేపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజు ను పూనుగొండ్లకు సాగనంపనున్నారు. ఆదివాసీ పూజారులు, మంత్రులు మొదలుకొని ప్రభుత్వ యంత్రాంగం అక్కడే ఉండి మేడారం మహాజాతరకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా పటిష్టం చర్యలు తీసుకున్నారు. స్థానిక మంత్రి సీతక్క అన్నీ తానై జాతర సక్సెస్‌కు కారణమయ్యారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, సమాచార & పౌరసంబంధాలు, రెవిన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుల నేతృత్వంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీజ, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమీషనర్ సునీల్ కుమార్, ఐటీడీఏ పీవో అంకిత్ కుమార్, ఎస్పి శభరీష్ లు అన్ని ఏర్పాట్లు చేసి జాతరను ముందుకు కొనసాగించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళసై, కేంద్ర గిరిజన మంత్రి అర్జున్ ముండా, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు వన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ముందస్తు మొక్కులు చెల్లించుకున్న భక్తులు, ఈ నాలుగు రోజులు అమ్మవార్లను దర్శించుకున్న భక్త జనమంతా కలిపి ఇప్పటి వరకు కోటి మందికిపైగా దర్శనాలు చేసుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
– వెల్లివిరిసిన ఆధ్యాత్మికత..
మేడారంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. వన దేవతల నామస్మరణతో మేడారం మార్మోగుతోంది. అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కలు చెల్లించుకుంటూ తన్మయత్వానికి గురవుతున్నారు భక్తులు. ముఖ్యంగా మేడారంలో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమయ్యాక భక్తుల తాకిడి మరింత పెరిగింది. సమ్మక్క తల్లి గద్దెను చేరాక సాధారణ భక్తులతో పాటు వీఐపీలు దర్శనానికి క్యూకట్టారు. వరాలు ఇచ్చే తల్లులు వనదేవతలు అంటూ ఉత్సాహంగా దర్శనానికి వస్తున్నారు భక్తులు. దీంతో మేడారం సమ్మక్క సారలమ్మ జనజాతర వైభవోపేతంగా జరుగుతోంది. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారులను కోటి మందికిపైగా భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తోంది.రెండేళ్లకోసారి ఇద్దరు అమ్మవారులు గద్దెలపై రెండురోజుల పాటు కొలువై ఉండడంతో దర్శించుకునేందుకు పోటెత్తారు భక్తులు. భక్తుల రద్దీతో మేడారం జనసంద్రంగా మారి మహానగరాన్ని తలపిస్తుంది. చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించినప్పటి నుంచి, నిరంతరాయంగా దర్శనాలు కొనసాగుతున్నాయి. బారులు తీరి అమ్మవారులకు ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లిస్తున్నారు భక్తులు. గద్దెలపై ప్రాంగణంలో జలప్రవాహంలా భక్తుల రద్దీ కొనసాగుతోంది.