మర్రి మాకు వాగులో మహిళ మృతదేహం లభ్యం
– దర్యాప్తు ప్రారంభించిన పేరూరు పోలీసులు
వెంకటాపురం, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటా పురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు మండలం పేరూరు గ్రామ సమీపంలో మర్రి మాకు వాగులో నీటిపై తేలుతున్న మహిళ మృతదేహం ఆదివారం సాయంత్రం లభ్యమయింది. గమనించిన స్థానికులు విషయాన్ని పేరూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని వాగు నుండి వెలికి తీశారు. మృతి చెందిన మహిళకు సుమారు 60 సంవత్సరా లు పైబడి ఉంటాయని అంచనా వేశారు. ఇటీవల గోదావరి వరదలు, భారీ వర్షాలు కారణంగా వృద్ధురాలు ప్రమాద వశాత్తు ప్రవాహంలో పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ విషయంపై పేరూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జి. కృష్ణ ప్రసాద్ ను ఆదివారం సాయంత్రం మీడియా ప్రతినిధులు వివరణ కోరగా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.