మావోయిస్టులు లొంగిపోయి శాంతియుత జీవితం గడపాలి
– 20 మంది మావోయిస్టుల అరెస్టు
– భారీగా ఆయుధాలు స్వాధీనం
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న మావోలు లొంగిపోయి తమ కుటుంబాలతో శాంతి యుత జీవితం గడపాలని జిల్లా ఎస్పీ శబరిష్ సూచించారు. పార్టీలో వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న 20 మంది మావోయిస్టు లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శబరిష్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… మావోయిస్టులు గత కొంత కాలంగా కర్రెగుట్టలను కేంద్రంగా చేసుకొని చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగి స్తుండడంతో ఇటీవల సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలు, చత్తీస్గడ్ పోలీసులు భారీ స్థాయిలో కర్రేగుట్టలపై సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. కర్రెగుట్టలపై జరుగుతున్న గాలింపు చర్యల్లో భాగంగా అక్కడ ఆశ్రయం పొందిన సిపీఐ మావోయిస్టులు తప్పించుకునేందుకు చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి వివిధ ప్రదేశాలకు పారిపోతున్నారనే సమాచారంతో ములుగు జిల్లాలో కి నిషేధిత మావోయిస్టులు ప్రవేశించకుండా ములుగు జిల్లా పోలీస్ పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి అన్ని విధాలుగా చర్యలు చేపట్టారన్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పాలెం ప్రాజెక్టు వద్ద వాహన తనిఖీల్లో ఆరుగురు నిషేధిత మావోయిస్టులు, శనివారం ఉదయం వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో మురుమూరు అటవీ ప్రాంతంలో చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లో మరో ఏడుగురు మావోయి స్టులు, కన్నాయి గూడెం పోలీస్ స్టేషన్ పరిధి గుట్టల గంగారం గుత్తి కోయ గ్రామ సమీపంలో చేపట్టిన పెట్రోలింగ్లో ఏడుగురు నిషేధిత మావోయిస్టులు మొత్తం కలిపి 20 మంది మావోయిస్టు సభ్యులను అరెస్టు చేసినట్లు ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ తెలిపారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అరెస్టు అయిన మావోల వివరాలు
కట్టం భీమ్, సోడి ఉంగీ, వంజామ్ ముకే, హేమల సుక్కి, కుంజాం ఉంగా, మడకం మాసే, పునేం భీమే, కట్టం జోగా, పునేం భీమే, నూప గంగి, హేమల సన్నీ, ఊకే మాసా, పోడియం లక్క, ఉండం సోముడు, కుంజాం లక్క, మారిగల సుమతి, మడకాం కోసి, పోడియం జోగి, మడవి సీమ, మూసాకి రంజు లను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాల వివరాలు 5.56ఎమ్ ఎమ్ ఇన్సాస్ రైఫిల్స్ 3, 7.62 ఎంఎం ఎస్ ఎల్ ఆర్ రైఫిల్స్ 04, .303 రైఫిల్ ఒకటి, 8 ఎంఎం రైఫిల్ 04, 12 బోర్ వెపన్, కార్టీజెస్ 16, లైవ్ గ్రైనేట్స్ 2, రూ. 58వేల155 నగదు, వాకి టాకీస్ విత్ యాంటెన్నాస్ 04, రేడియోస్ 06, చార్జిబుల్ బ్యాటరీస్ 02, పార్టీ సాహిత్య పుస్తకాలు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.