ఆదివాసుల అభివృద్ధిని అడ్డుకుంటున్న మావోయిస్టులు
– అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లకుండా భయాందోళనలో ప్రజలు
– తెలంగాణ రాష్ట్ర ఆదివాసి యువజన సంఘం పేరిట లేఖ విడుదల
– ప్రకటన పట్ల పలు అనుమానాలు..?
కాటారం, తెలంగాణ జ్యోతి : ఆపరేషన్ కగార్ దాడి నుంచి రక్షణ పొందడానికి కర్రి గుట్టలపై బాంబులు పెట్టామని, అటువైపు వేటకు, తునికాకు సేకరణకు, అటవీ ఉత్పత్తుల కోసం ఎవరూ వెళ్ళకూడదు అంటూ మావోయిస్టులు లేఖ విడుదల చేయడం వారి అభివృద్ధిని అడ్డుకోవడమేని తెలంగాణ రాష్ర్ట ఆదివాసీ యువజన సంఘం విమర్శించింది. ఆదివాసి ప్రజలకు సిపిఐ మావోయిస్టు వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో లేఖ విడుదల చేయడం ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేయడమేననని ఆరోపిచారు. ఈమేరకు తెలంగాణ ఆదివాసీ యువజన సంఘం పేరిట బుధవారం ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో వివరాలు ఈవిధంగా ఉన్నాయి. మావోయిస్టులారా నిత్యం ఆదివాసి ప్రజలపై ఆధారపడి బ్రతికే మీరు అడవులే ఆధారంగా జీవనోపాధి పొందుతున్న ఆదివాసి ప్రజలను అడవుల్లోకి రావద్దని చెప్పే అధికారం మీకు ఎవరిచ్చారు.? భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను నియంత్రించే అధికారం మీకెక్కడిది? అడవుల్లో విచ్చలవిడిగా మందు పాతరలు పెడితే ఆదివాసులు బ్రతికేదెలా? మమ్మల్ని బ్రతకనివ్వరా, మా ప్రాంతాలపై మీ పెత్తనమేంటి? మేము అడవుల్లోకి వెళ్లకుండా ఇంకెక్కడికి వెళ్లాలి, మీరు తలదాచుకోవడానికి మా ప్రాంతాలే దొరికాయా? మీరు అమర్చిన మందుపాతరాల వల్ల ఇప్పటికే చాలామంది అమాయక ఆదివాసీలు చనిపోయారు. ఎందరో ఆదివాసులు శాశ్వత అంగవైకల్యానికి గురయ్యారు. మూగ జీవాలు సైతం ప్రాణాలు కోల్పోయాయి. పోలీసు ఇన్ ఫార్మర్ల నెపంతో దారుణ హత్యలు చేస్తున్నారు. ఎన్నో కుటుంబాలు అనాధలై రోడ్డున పడ్డాయి. మేము ఎవరిమీద ఆధారపడకుండా మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాము. పోలీసు ఇన్ఫార్మర్లుగా మారాల్సిన అవసరం మాకు అసలు లేనేలేదు. పోలీసు ఇన్ఫార్మర్లనే నిందలు మాపై మోపుతున్నారు. మేము కేవలం మా జీవనాధారం కోసమే అడవుల్లోకి వెళ్తున్నాం. కేవలం మీ ప్రాణాలకు మమ్మల్ని బలి పశువులుగా చేస్తూ కనీస అభివృద్ధికి కూడా నోచుకోకుండా అనుక్షణం అడ్డుపడుతూనే ఉన్నారు. ఇదేనా మీ సిద్ధాంతం ?ఇందుకోసమేనా మీ ఉద్యమం? ఆదివాసి ప్రజల జీవనోపాధి అడ్డుకుంటే మీ నియంతృత్వ పోకడలపై కొమురం భీమ్ పోరాట స్ఫూర్తితో ఆదివాసీ సమాజం వేలాది మందితో దండెత్తి మీపై తిరుగుబాటు చేస్తుంది. బాంబులు పెట్టామని చెప్పడం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న మిమ్మల్ని చూస్తూ ఊరుకోము. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకడం. మా సహనాన్ని పరీక్షించకండి. ప్రజలారా తరతరాలుగా ఆదివాసులకు మావోయిస్టుల వల్ల జరుగుతున్న నష్టాలను ముక్తకంఠంతో ప్రశ్నిద్దాం. అయితే ఈ ప్రకటన పట్ల కొందరు నిజంగా ఆదివాసీ సంఘం విడుదల చేసిందా..? లేక ఈ ప్రకటన వెనుక ఇకా ఎవరైనా ఉన్నారా అనే అనుమానాలను ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.