లక్నవరం సందర్శన తాత్కాలికంగా నిలిపివేత
ములుగు, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ఎలాగూ మేడారం జాతరకు వచ్చాం.. పనిలో పనిగా లక్నవరం అందాలను తిలకించి తీరిగ్గా పోదామనుకునే ప్రకృతి ప్రేమికులకు నిజంగా బ్యాడ్న్యూసే..! సరస్సు వద్దకు ఈ నెల 19 నుండి 26 వరకు అనుమతించేది లేదంటున్నారు. పస్ర సర్కిల్ పోలీసులు. ఎందుకంటే..? ప్రకృతి రమణీయ అందాలు కలిగిన లక్నవరాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముంది. చల్వాయి నుంచి బుస్సాపూర్ వరకు డబుల్ రోడ్డు ఉంది. సరస్సు వద్దకు సుమారు కిలోమీటర్ పొడవునా ఘాట్రోడ్డు ఉండడం, సరస్సులోని వేలాడే వంతెన సామర్థ్యం తక్కువగా ఉండడంతో ఈత కొట్టే ప్రయత్నంలో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని భావించిన పోలీసులు, ఈ నిర్ణయం తీసుకున్నారు. సందర్శకులను నియంత్రించడం కష్టతరం కానుండగా ఎట్టి పరిస్థితిలోనూ పర్యాటకులను లక్నవరం వద్దకు వెళ్లేందుకు అంగీక రించమని పస్ర ఎస్సై షేక్ మస్తాన్ తెలిపారు.