ఎడ్ల బండిని ఢీకొని పల్టీలు కొట్టిన కూలీల ఆటో
– ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలకు గాయాలు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం ప్రధాన రహదారిపై కూలీలతో వస్తున్న ఆటో ఎడ్ల బండి ని ఢీకొని ఆటో పల్టీ కొట్టిన సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది కూలీలలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు హుటాహుటిన సంఘటన ప్రాంతాన్ని చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. వీరంతా సూరవీడు గ్రామంలో మిరపకాయల కోతకు కూలికి వెళ్లి రారా తిరిగి స్వగ్రామం చొక్కాల, విఆర్కేపురం వస్తుండగా పాత్రాపురం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స కు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం బలమైన గాయాలు తగిలిన నలుగురు కూలీలను మెరుగైన వైద్యం కోసం, భద్రాచలం, ఏటూరునాగారం తరలించారు.