వైద్యుల నిర్లక్ష్యం తో ఖరీదు కుటుంబరావు మరణం
వైద్యుల నిర్లక్ష్యం తో ఖరీదు కుటుంబరావు మరణం
– రోగులను తరలించే కేంద్రాలుగా ప్రభుత్వ ఆసుపత్రులు
– రిఫరల్ పేరుతో చంపేస్తున్నారు
– జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం
– ఏఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొరసా నరసింహ మూర్తి
వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం బర్ల గూడెం గ్రామానికి చెందిన కుటుంబరావు మరణానికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొరస నరసింహమూర్తి ములుగులో జిల్లా కలెక్టర్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయా నకళ్ళను మంగళవారం వెంకటాపురంలో మీడియాకు విడుదల చేశారు. బర్లగూడెం గ్రామానికి చెందిన తాటి కుటుంబ రావు ఆక్సిడెంట్ కి గురై సరైన సమయంలో వైద్యం అందక మరణించాడని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ ని ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలిసి ఏజెన్సీ వైద్యం పైన వినతిపత్రం ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వ వైద్య ఆసుపత్రులు ఒక చోట నుండి మరొక చోటికి రోగులను, క్షత గాత్రులను తరలించే రవాణా కేంద్రాలుగా మారినాయని కలెక్టర్ కి తెలిపారు. మారుమూల గ్రామం నుండి పాము కాటుకు గురయి మండలంలోని ప్రభుత్వ వైద్యశాలకు వెళ్తే వైద్యులు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యశాలకు రిఫర్ చేస్తారు. అక్కడ వైద్యులు చూసి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు ఆసుపత్రికి రిఫర్ చేస్తారు. ఇక్కడ వైద్యులు వరంగల్ ఎంజిఎంకి తరలిస్తారని వివరించారు. ఇలా చేయడం వల్ల క్షతగాత్రులు మార్గ మధ్య లోనే మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైద్యుల పైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని కోరారు. కనీసం గ్రామీణ ఆర్ ఎం పి వైద్యులు చేసే ప్రధమ చికిత్స కూడా అందివ్వడం లేదని అన్నారు. వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఉన్న ప్రజలకు అత్యవసర ప్రభుత్వ ఆరోగ్య సేవలు అందక అనేక ప్రాణాలు ప్రయాణ మార్గంలోనే గాల్లో కలుస్తున్నాయన్నారు. వైద్యుల నిర్లక్ష్యం పేద, మధ్యతరగతి ప్రజలకు శాపంగా మారిందని కలెక్టర్ కి తెలియ జేశారు. గుండె పోటుకు గురైన వారిని వందల కిలోమీటర్లు దూరం లో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లే లోపే చనిపోతున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే 70 శాతం ప్రజలు ఉన్నప్పుడు అధిక శాతం ఉన్న గ్రామీణ ప్రాంతంలో వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలం అవుతోందని విమర్శించారు . పేద ప్రజల ప్రాణాలకు రక్షణ లేని దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ప్రజలు ఓటేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసేది ఆరోగ్య సేవలు అందక చనిపోవడానికేనా అని ప్రశ్నిం చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యం అందక మరణించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందక సంభవిస్తున్న మరణాలకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి అని నర్సింహా మూర్తి డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఏజెన్సీ వైద్యం పైన దృష్టి పెట్టాలన్నారు. స్వతహాగా ఎమ్మెల్యే డాక్టర్ కాబట్టి ఏజెన్సీ వైద్యం సమస్యల పైన అవగాహన ఉంటుందని గుర్తు చేశారు. సరైన వైద్యం లేక పోవడం తో రెండు మండలాల ప్రజలు భయం గుప్పిట్లో బిక్కు బిక్కు మని బ్రతుకుతున్నారని తెలిపారు. మారు మూల మండలాలకు వైద్యులు ఎవరూ రావడానికి ఇష్టపడడం లేదని కలెక్టర్ దివాకర టి ఎస్ తెలిపారని అన్నారు. త్వరలోనే వైద్యులను నియమిస్తామని హామీ ఇచ్చినట్లు తెలియజేసారు. వాజేడు మండలం చెరుకూరు గ్రామంలో వలస గిరిజనేతరుడు చేస్తున్న అక్రమ నిర్మాణాన్ని తొలిగించాలని కూడా కలెక్టర్ ని కోరడం జరిగిందన్నారు. ఎల్ టి ఆర్, పెసా చట్టాల అమలు జరిగేలా చూస్తా అని కలెక్టర్ తెలిపారని అన్నారు. వెంకటాపురం మండలంలోని రామచంద్ర పురం ఆదివాసి రైతులు గిరిజనేతరులు భూస్వాములు, పట్టా ల్యాండ్స్ పై ఇసుక క్వారీ అనుమతులు పొందాలని చూస్తున్నారని, ఈ.సి. అనుమతులు ఇవ్వొద్దని కలెక్టర్ ను ఆయా గ్రామాల గిరిజనులు కోరారు.చెరుకూరు, రామచంద్రపురం గ్రామాల ఆదివాసీలు ఈకార్యక్రమం లో పాల్గొన్నారు.