బ్లాక్ బెర్రీ లో ఇష్టారాజ్యం..!
బ్లాక్ బెర్రీ లో ఇష్టారాజ్యం..!
– ఒక్కొక్కరికి ఒక్కో విధంగా రెస్పాండ్
హైదరాబాద్, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో ఏర్పాటుచేసిన బ్లాక్ బెర్రీ స్పాట్లో నిర్వాహకులు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పర్యాటకశాఖ అభివృద్ధిలో భాగంగా ప్రైవేటు భాగస్వామ్యంతో చర్యలు చేపట్టగా ప్రకృతి ఒడిలో సేద తీరెందుకు టూరిస్టులను ఆహ్వానిస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.2500 నుంచి రూ.3500 వసూలు చేస్తున్నట్లు పర్యాటకులు చెబుతున్నారు. అయితే బుకింగ్ చేసుకు న్న వారు సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు వెళ్లాల్సి ఉంటుంది. వారికి రాత్రి భోజనం రెండు సార్లు డ్రింక్స్ ఉదయం టిఫిన్ అందిస్తారు. అయితే సంక్రాంతి సెలవు దినాల్లో బ్లాక్ బెర్రీ స్పాట్లో నిర్వాహకులు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. పలువురు బ్లాక్ బెర్రీ లోపల డిజె శబ్దాలతో మధ్యాహ్నం సందర్భంలో ఎంజాయ్ చేస్తుంటే, జర్నలిస్టులు కుటుంబ సభ్యులతో చూసేందుకు వెళ్లగా కనీసం అనుమతించక పోగా దురుసుగా వ్యవహరించి నట్లు సమాచారం.. కేవలం పోలీసు అధికారులు చెబితేనే తమను లోపలికి అనుమతిస్తామని రూడీగా చెబుతున్నారు. పర్యాటకులకు ఓ విధంగా, పోలీసుల బంధువులకు, తెలిసిన వారికి మరో విధంగా టూరిజం, అటవీశాఖ అధికారులు వ్యవ హరించడం విమర్శలకు తావిస్తోంది. కేవలం వర్షాకాలం ఆరంభం వరకే బ్లాక్ బెర్రీ నిర్వహణ జరగనుండగా మందు బాబులకు అడ్డాగా మారుతోందని, సరైన భద్రత ఏర్పాట్లు లేవని విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు ఈవిషయంపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. పర్యాటకులను నియంత్రించాల్సిన ప్రైవేటు సిబ్బంది గేటు దగ్గర లేకపోవడం వలన పర్యాటకులు బ్లాక్ బెర్రీ పాయిం ట్ వద్ద వరకు బుధవారం మధ్యాహ్నం చేరుకోవడంతో కొద్దిపాటి సంఘర్షణ సిబ్బందితో చోటుచేసుకుంది. లోపలికి ఎంట్రీ లేదు అన్నప్పుడు గేటు దగ్గరే ఆపుతే కిలోమీటర్ పైగా లోపలికి నడిచి రాము కదా అంటూ సిబ్బందిని పర్యాటకులు ప్రశ్నించగా వారి వద్ద నుండి ఎటువంటి సమాధానం రాలేదు. పైగా సిబ్బం దికి ఎటువంటి డ్రెస్ కోడ్, బ్యాడ్జీలు లేకపోవడం విడ్డూరం. ఇప్పటికైనా బ్లాక్ బెర్రీ గేటు వద్ద టైమింగ్ బోర్డు, ధరల పట్టికను ఏర్పాటుచేసి సెక్యూరిటీ అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు.