చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రెండు నెలల్లో నీరందివ్వాలి
చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రెండు నెలల్లో నీరందివ్వాలి
– జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : చిన్న కాళేశ్వరం స్టేజ్ 2 పంప్ హౌస్ మరమ్మత్తు పనులను రెండు నెలల్లో పూర్తిచేసి, వానాకాలం పంటకు సాగునీరు అందివ్వాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. బుధవారం కాటారం మండలం, గారేపల్లి వద్ద రెండవ దశ పంప్ హౌస్ వద్ద బీరసాగర్ వద్ద నిర్మిస్తున్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మందిరం, ఎర్ర చెరువులకు సాగు నీరు అందించేందుకు చేపట్టాల్సిన చర్య లపై రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న రెండు నెలల కాలంలో పంప్ హౌస్ వద్ద గోదావరి నుండి పంప్ హౌస్ అప్రోచ్ కెనాల్, పంప్ హౌస్ మోటార్లు మరమ్మత్తులు పూర్తి చేయాలని తెలిపారు. మందిరం, ఎర్ర చెరువు నీటి సామ ర్ధ్యాన్ని పెంచుటకు చేపట్టాల్సిన చర్యలపై ప్రతిపాదనలు అందచేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రెండవ పంప్ హౌస్ వద్ద నిర్మిస్తున్న విద్యుత్ ఉప కేంద్రం పనులు వేగవంతం చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఉప కేంద్రం నిర్మాణంలో పనులు జాప్యం కావొద్దని, పనులు నిరంతరాయంగా జరగాలని తెలిపారు. అలాగే పెండింగ్ ఉన్న భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. గోదావరి తీర ప్రాంత రైతులకు సాగునీరు అందించేందుకు చేపట్టిన ఈ పనుల వల్ల 45 ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. ప్రాజెక్టు ద్వారా 13 చెరువులకు నీరు సరఫరా జరుగుతుందని, తద్వారా పంటలకు నీటి ఇబ్బందులు లేకుండా సమృద్ధిగా నీటి సరఫరా జరుగు తుందన్నారు. అప్రోచ్ కెనాల్ పంప్ హౌస్ మరమ్మత్తు పనులను పూర్తి చేసి ఎర్ర చెరువు , మందిరం చెరువు, కొత్తచెరువు, గారేపల్లి చెరువులను గోదావరి నీటితో నింపాలన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు, కాలువల నిర్మాణానికి కావలసిన భూ సేకరణ ప్రక్రియకు, అలాగే అవసరమైన నిధులు మంజూరుకు ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు.అనంతరం రెవిన్యూ ఇరిగేషన్ అధికారులతో కలిసి కాటారం మండలంలోని చింతల చెరువు, కొత్త చెరువు, మందిరం చెరువు, ఎర్ర చెరువులను, మహాదేవ పూర్ వద్ద ఆగిపోయిన పైపు లైను పనులను పరిశీలించారు. భూగర్భం నుండి పైపు లైన్లు వేస్తున్నందున రక్షణగా హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మంగీలాల్, తహసీల్దార్ నాగరాజు, ఇరిగేషన్ డిఈలు ఉపేందర్, సూర్య, పరశురాం, ఏఈలు విజయ కుమార్, వెంకన్న, తిరుపతి, ఎం.ఈ.ఐ.ఎల్ ప్రాజెక్టు మేనేజర్ పాషా తదితరులు పాల్గొన్నారు.