నూతన రెవెన్యూ చట్టంతో ఎల్. టి .ఆర్. 1/70 చట్టానికి తూట్లు
– ఆదివాసి సంక్షేమ పరిషత్.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా ఆలుబాక గ్రామంలో శనివారం ఆదివాసి సంక్షేమ పరిషత్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల ఉపాధ్యక్షులు తాటి రాంబాబు మాట్లాడుతూ 5వ షెడ్యూల్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నాటి నుండి నేటి వరకు ఆదివాసుల స్థితిగతులు ఇబ్బందికరంగా మారాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు ఆదివాసుల పట్ల నిరంకుశ వైఖరి, ఆదివాసి హక్కులను చట్టాలను హరించడం కోసమే అని మండిపడ్డారు. భారత రాజ్యాంగం ఆదివాసుల భూములకు సంబంధించిన క్షేత్ర స్థాయి పరిశీలన చేసి రక్షణ కవచం కల్పించే (ఎల్ టి ఆర్) 1/70 చట్టాన్ని తూట్లు పొడిచే విధంగా నూతన రెవెన్యూ చట్టం తో రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో నూతన రెవెన్యూ చట్టాన్ని అమలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివాసులు సాగులో ఉన్న ప్రభుత్వ అసైన్మెంట్ భూములకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి నేతలు మీడియం అర్జున్, సంధ కన్నయ్య, మడకం ప్రసాద్, మడి సమ్మయ్య, కుంజ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.