చొక్కాలలో అగ్ని ప్రమాదానికి ఇల్లు దగ్ధం
వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి:ములుగు జిల్లా వెంకటాపురం మండలం విఆర్ కెపురం పంచాయతీ చొక్కాల గ్రామంలో ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతం లో జరిగి న అగ్నిప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. కూలి నాలి చేసుకొని జీవనం సాగిస్తున్న మచ్చా రవితేజ, సోద రుడు రాంబాబు వారి కుటుంబ సభ్యులంతా కూలి పనుల నిమిత్తం వెళ్లారు. ఆ సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇరుగు పొరుగు వారు వెంటనే అప్రమత్తమై ఇంట్లో ఉన్న వంట గ్యాస్ సిలిండర్, పేలుడు పదార్థాలను బయటకు తీశారు. వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. గ్రామ యువకులు, ప్రజలు మంటలను అదుపు లోకి తీసుకొచ్చారు. రెక్కాడితే కాని డొక్కాడని ఆ పేద కుటుంబం కట్టుబట్టలతో బయటపడింది. ప్రభుత్వపరంగా తమ పేద కుటుంబాన్ని ఆదుకోవాలని అగ్ని బాధితులు, గ్రామస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.