సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్ ను కొట్టిన టీచర్
– పన్ను విరగడంతో తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ఆగ్రహం
ములుగు : ములుగు మండలంలోని మల్లంపల్లి సమీపంలో గల సాంఘి సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న ఆరవ తరగతి విద్యార్థిని అసిస్టెంట్ కేర్ టేకర్ కొట్టిన సంఘటన చోటు చేసుకుంది. దీంతో విద్యార్థి పన్ను విరిగిపోగా తల్లిదండ్రులు, ఎస్ఎఫ్ఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకాల మండలం నడికూడకు చెందిన విద్యార్థి పాఠశాలలో ఆరవతరగతి చదువుతున్నాడు. అయితే సోమవారం విద్యార్థి అల్లరి చేయడంతో పాఠశాలలో అసిస్టెంట్ కేర్ టేకర్ గా పనిచేస్తున్న రాజు విద్యార్థి ముఖంపై కొట్టడంతో పన్ను విరిగింది. దీంతో తీవ్రంగా రోదిస్తూ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి విద్యార్థిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా, ఈ సంఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి అసిస్టెంట్ కేర్ టేకర్ రాజు పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి కోగిల బాలు డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా చూడాలని కోరారు.