భారీ వర్షాలు, గోదావరి వరదలతో స్తంభించిన జనజీవనం
– వెంకటాపురం వాజేడు మండలాలను చుట్టు ముట్టిన గోదారి వరద.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : గోదావరి పరి వాహక ప్రాంతమైన ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాలలో భారీ వర్షాలు, గోదావరి వరదల కారణంగా వాగులు, గోదావరి వరద నీరు రహదారుల పైకి చొచ్చుకు వచ్చి రాకపోకలను స్తంభింప చేశాయి. వాజేడు మండలం టేకులగూడెం వద్ద జాతీయ రహదారి 163 పైకి వరద చేరుకొని జాతీయ రహదారిని ముంచివేసింది. దీంతో చతీస్గఢ్ హైదరాబాద్, వరంగల్ ప్రాంతాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. పోలీస్ శాఖ ముంపుకు గురి అయిన టేకులగూడెం జాతీయ రహదారి వద్ద రాకపోకల ను నిలిపివేశారు. ఈ మేరకు స్టాఫ్ బోట్లను ఏర్పాటు చేశారు. దీంతో వందలాది వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి. ఎడతెరిపి లేని భారీ వర్షాలు కారణంగా పల్ల పు ప్రాంతాలు జలమయమయ్యాయి. వెంకటాపురం, భద్రాచలం రాష్ట్రీయ రహదారి నెంబర్ 12 పై అనేక చోట్ల రహదారిపైకి గోదారి వరద నీరు చొచ్చుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. భారీ వర్షాలు కారణంగా తెలంగాణ నయాగారాగా పేరుగాంచిన వాజేడు మండలం లోనీ బొగథ జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు పర్యాటకుల సందర్శనను నిలిపివేశారు. అలాగే ముత్యం ధార, బొల్లారంతో పాటు అనేక జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఒకపక్క గోదావరి వరదలు, మరోపక్క ఎడతెరిపి లేని భారీ వర్షాలు కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. వాజేడు మండలంలోని పూసూరు వద్ద గోదావరి భారీ వంతెన పైనుండి అనేకమంది గోదావరి తల్లి పరవళ్ళు ను ఆసక్తిగా తిలకిస్తూ, కొంతమంది మహిళా సోదరీమణులు పసుపు, కుంకాలు పుష్పాలతో గోదారమ్మ తల్లి శాంతించ మంటూ వంతెన పై నుండి గోదావరిలోకి పసుపు, కుఃకాలు జారవిడుస్తున్నారు. ఎవరు వాగులు దాటవద్దని, చేపల వేటకు వెళ్ళవద్దని అదికారులు హెచ్చరి కలు జారీ చేస్తున్నారు. భారీ వర్షాలు కారణంగా ఇళ్ల నుండి బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని, ములుగు జిల్లా కలెక్టర్, ములుగు జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే వెంకటాపురం వాజేడు మండలంలోని పోలీస్, రెవిన్యూ శాఖలు ఫ్లడ్ డ్యూటి అధికారులు ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ, జాగ్రత్తలు వహించాలని, ఆయా గ్రామా ల ప్రజలను కోరారు.